'మంచం కింద దాక్కున్నాం' | Windows Shook, We Hid Under Bed: Pathankot Martyr's Daughter On The Attack | Sakshi
Sakshi News home page

'మంచం కింద దాక్కున్నాం'

Jan 4 2016 3:02 PM | Updated on Sep 3 2017 3:05 PM

'మంచం కింద దాక్కున్నాం'

'మంచం కింద దాక్కున్నాం'

'ఆయన కూతురిగా పుట్టినందుకు నేను చాలా చాలా గర్వపడుతున్నా' అని అమరజవాను ఫతే సింగ్ కుమార్తె మధు అన్నారు.

గురుదాస్ పూర్‌: 'ఆయన కూతురిగా పుట్టినందుకు నేను చాలా చాలా గర్వపడుతున్నా' అని అమరజవాను ఫతే సింగ్ కుమార్తె మధు అన్నారు. శనివారం పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లోకి చొరబడ్డ ఉగ్రవాదులతో పోరాడుతూ సుబేదార్ మేజర్ ఫతే సింగ్ ప్రాణాలు కోల్పోయారు. ముష్కరులు చొరబడ్డారనే సమాచారం తెలియగానే యూనిఫాం ధరించి తన తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోయారని ఆమె తెలిపింది. 1995 కామన్వెల్త్ క్రీడల్లో షూటింగ్ ఈవెంట్ లో స్వర్ణ, రజత పతకాలు గెలిచిన ఫతే సింగ్ తాను చనిపోయే ముందు ఉగ్రవాదుల్లో ఒకడి తుపాకీ లాక్కుని అతడిని మట్టుబెట్టారు.

తన తండ్రి ఉగ్రవాదులతో పోరాడానికి వెళ్లిపోగానే ఇంట్లో తాము బిక్కుబిక్కుమంటూ గడిపామని టీచర్ గా పనిచేస్తున్న 25 ఏళ్ల మధు చెప్పింది. 'కాల్పుల మోత విన్పిస్తోంది. తుపాకీ బుల్లెట్లు మా ఇంటి కిటికీ దగ్గర పడుతున్నాయి. మేము రెండు గంటల పాటు మంచం కింద దాక్కున్నాం. కింద చాలా చలిగా ఉంది. కానీ మంచంపై పడుకుని మా ప్రాణాలను బలిపెట్టే సాహసం చేయలేకపోయాం. మమ్మల్ని ఉగ్రవాదులు గుర్తిస్తారనే భయంతో ఇంట్లో లైట్లు అన్నీ ఆర్పేశాం. చిమ్మచీకటిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపాం' అని మధు చెప్పింది. సత్యం కోసం గళం విప్పాలి, పోరాడాలని అని తన తండ్రి చెప్పేవారని గుర్తు చేసుకుంది. చెడును ఓడించడానికి మంచికి మనవంతు సాయం చేయాలని అనేవారని, ఆ విలువలను ఆయన తుదివరకు పాటించారని వెల్లడించింది.

పఠాన్ కోఠ్ ఎయిర్ బేస్ లో చొరబడిన ఉగ్రవాదులతో ఫతే సింగ్ సహా ఏడుగురు సైనికులు వీరమరణం పొందారు. 20 మంది గాయపడ్డారు. ఐదుగురు ఉగ్రవాదులను సైనికులు హతమార్చారు. మరో ఇద్దరు ముష్కరులు ఉన్నట్టు అనుమానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement