
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని మలుపు తిప్పిన ఘటన దొడ్డి కొమురయ్య (Doddi Komaraiah) తెలంగాణ వేగు చుక్క మరణం. కొమురయ్య కడవెండి గ్రామ యువకుడు. నిజాం రాజ్యంలో ప్రముఖుడైన విస్నూర్ దేశ్‌ముఖ్ రాపాక రామ చంద్రారెడ్డి కింద ఉన్న 60 గ్రామాలలో కడవెండి ఒకటి. ఇక్కడే దేశ్‌ముఖ్ తల్లి జానమ్మ నివసిస్తూ తన అకృత్యాలను కొనసాగిస్తూ ఉండేది. ఆంధ్ర మహాసభ ప్రవేశించకముందే ఈ గ్రామం దేశముఖ్ అకృత్యాలనూ, పెత్తందారీ సంస్కృతినీ విమర్శించడం, ధిక్కరించడం మొదలు పెట్టింది. దున్నేవానికే భూమి, అక్రమ పన్నుల రద్దు వంటి కమ్యూనిస్ట్ నినాదాలతో ప్రేరేపితమయ్యింది. వెట్టి చాకిరీ, రకరకాల పన్నులు, వడ్డీ వ్యాపారుల దోపిడీ వంటి వాటికి వ్యతిరేకంగా గ్రామం సంఘటితమవుతూ ఉంది.
ఈ క్రమంలో కడవెండి గ్రామానికి 1946 జూలై 4న నిజాం రాజ్య రెవెన్యూ అధికారులు లెవీ ధాన్యపు సేకరణకు వచ్చారు. తమ దగ్గర తినడానికే ధాన్యం లేదనీ, లెవీ ధాన్యం ఎక్కడి నుంచి తేవాలనీ ప్రశ్నించారు గ్రామస్థులు. లెవీ వసూలుకు వ్యతిరేకంగా, దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి ఆగడాలకు వ్యతిరేకంగా రెతులు, కూలీలు ఆ రోజు ఒక ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో దొడ్డి కొమురయ్య– మల్లయ్య సోదరులు కూడా పాల్గొన్నారు. వారు ముందువరుసలో ఉండి నినాదాలు చేస్తూ ముందుకు కదులుతుండగా మిస్కిన్ అలీ నేతృత్వంలో దొర గుండాలు ఊరేగింపుపై కాల్పులు జరిపారు. తూటాలు తగలడంతో కొమురయ్య మృతిచెందాడు. అనేకమందికి గాయాలయ్యాయి. కొమురయ్య అంత్యక్రియలకు వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. అతడి మరణంతో కమ్యూనిస్టులు తామూ ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పట్టాలనే నిర్ణయానికి వచ్చారు. దీంతో సాధారణ రైతాంగ పోరాటం మహత్తర సాయుధ పోరాటంగా మారింది. ఉద్యమం తాకిడికి భూస్వాములు గ్రామాలను వదిలి పట్టణాలకు వెళ్లిపోవడంతో వారి భూములను పేద రైతులు, కూలీలకు పంచారు నాటి ఉద్యమ నాయకులు.
– అస్నాల శ్రీనివాస్ ‘ దొడ్డి కొమురయ్య ఫౌండేషన్
(జులై 4 దొడ్డి కొమురయ్య వర్ధంతి)