మున్సిపాలిటీలకు అందని 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు
వచ్చే ఏడాది మార్చితో ముగియనున్న గడువు
మున్సిపల్ ఎన్నికలు జరగకనే జాప్యం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పురపాలక సంఘాలకు సకాలంలో ఎన్నికలు జరగకపోవడం, ఆదాయాన్ని ఆశించిన రీతిలో వృద్ధి చేసుకోకపోవడంతో 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ రాలేదు. దీంతో మున్సిపాలిటీలకు రావాల్సిన రూ.796 కోట్ల నిధుల విడుదల పెండింగ్‌లో పడింది. 15వ ఆర్థిక సంఘం గడువు వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. వచ్చే ఏడాది మార్చిలోగా మున్సిపల్ ఎన్నికలు జరగని పక్షంలో నిధుల విడుదల నిలిచే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. పురపాలక సంఘాలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తేనే నిధుల విడుదలకు మార్గం సుగమం అవుతుంది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనకు సంబంధించి హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సా ధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో నిధుల లేమి తో కొట్టుమిట్టాడుతున్న మున్సిపాలిటీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా అందక ఇబ్బందులు పడుతున్నాయి.
ఎన్నికలు జరగకుంటే ఇబ్బందులే..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు రాష్ట్రంలో 16 మున్సిపల్ కార్పొరేషన్లు, 144 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో జీహెచ్‌ఎంసీతోపాటు మరో ఏడు మున్సిపాలిటీలు మినహా మిగతా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలక మండళ్ల పదవీకాలం ఈ ఏడాది జనవరి 26న ముగిసింది. జీహెచ్‌ఎంసీతోపాటు మరో ఏడు మున్సిపాలిటీ పాలక మండళ్ల పదవీకాలం కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియనుంది. 15వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం నిధుల విడుదలకు మున్సిపల్ ఎన్నికల నిర్వహణ తప్పనిసరి. 2021–22 నుంచి 2025–26 వరకు 15వ ఆర్థిక సంఘం కాల పరిమితిగా నిర్దేశించారు.
వచ్చే ఏడాది మార్చితో 15వ ఆర్థిక సంఘం కాల పరిమితి కూడా ముగుస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రెండో విడతకు సంబంధించి రూ.114.43 కోట్లు ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేశారు. వచ్చే ఏడాది మార్చిలోగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగకుంటే 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులు విడుదలయ్యే అవకాశం లేదు. వచ్చే ఏడాది మున్సిపల్ ఎన్నికలు జరిగినా పెండింగ్‌లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం సర్దుబాటు చేస్తుందో లేదో తెలియదని పురపాలక శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
అర్హత సాధించని మున్సిపాలిటీలు
ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం.. రాష్ట్ర జీఎస్‌డీపీతో సమానంగా సొంత ఆదాయాన్ని పెంచుకునే మున్సిపాలిటీలకు మాత్రమే నిధులు విడుదలవుతాయి. ప్రస్తుతం రాష్ట్ర జీఎస్‌డీపీ 12 శాతం ఉండగా తదనుగుణంగా ఆదాయం పెంచుకోలేకపోయిన అనేక మున్సిపాలిటీలు 15వ ఆర్థిక సంఘం నిధులను పొందే అర్హతను కోల్పోయాయి. పలు మున్సిపాలిటీలు ఆస్తిపన్ను వసూలులో నిర్లక్ష్యం, సొంత ఆదాయం ఆశించిన రీతిలో లేకపోవడంతో గ్రాంట్లు పొందే అర్హతను సాధించలేకపోయాయి.
2024–25 ఆర్థిక సంవత్సరంలో కేవలం 78 మున్సిపాలిటీలకు మాత్రమే ఆర్థిక సంఘం నుంచి టైడ్, అన్‌టైడ్ నిధులు విడుదలయ్యాయి. టైడ్ గ్రాంట్లను పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వాననీటి సంరక్షణ వంటి పనులకు వినియోగించాలి. అన్‌టైడ్ గ్రాంట్లను వేతనాలు, ఇతర నిర్వహణ ఖర్చుల కోసం కాకుండా మున్సిపాలిటీల్లో అవసరమైన పనులను చేపట్టాలి. ఆర్థిక సంఘం గ్రాంట్లను ఏటా రెండు విడతల్లో మున్సిపాలిటీలకు విడుదల చేస్తారు.


