పాము విషం: ఫ్రాన్స్ టు చైనా వయా ఇండియా | Sakshi
Sakshi News home page

పాము విషం: ఫ్రాన్స్ టు చైనా వయా ఇండియా

Published Sun, Oct 16 2016 5:05 PM

పాము విషాన్ని భద్రపర్చిన బెల్జియం బుల్లెట్ ఫ్రూఫ్ జాడీలు - Sakshi

జల్పాయిగురి: అతి ప్రమాదకరమైన పాము ఒక్కకాటులో 200 మిల్లీగ్రాముల నుంచి 500 మిల్లీ గ్రాముల విషాన్ని విడుస్తుంది. ఈ లెక్కన 70,00,000 మిల్లీగ్రాములు.. అంటే 7 కిలోగ్రాముల విషం పోగవ్వాలంటే ఎన్నిపాములు ఎన్నిసార్లు కాటేయాలి? ఊహించడానికే అదోలా ఉందికదా! కానీ స్మగ్లర్లకు ఇది చాలా చిన్నవిషయం. ఎక్కడో ఫ్రాన్స్ అటవీ ప్రాంతంలో విషాన్ని సేకరించి బెల్జియంలో తయారైన బుల్లెట్ ప్రూఫ్ జాడీల్లో భద్రంగా దాచి.. వేల కిలోమీటర్ల దూరంలోని చైనాకు వయా ఇండియా సరఫరా చేస్తున్నారు! ఈ అంతర్జాతీయ విషపు ముఠా గుట్టు పశ్చిమబంగాలో రట్టైంది. సిలిగురి జిల్లాలోని బెలాకోబా రేంజ్ అటవీశాఖ అధికారులు రెండు రోజులు శ్రమించి రూ.200 కోట్లు విలువచేసే పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. బెలాకొడా రేంజర్ సంజయ్ దత్ శనివారం మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పారు..

'సిలిగురిలోని ఓ లాడ్జిలో ఇద్దరు వ్యక్తులు బసచేశారు. సరుకులు కనేందుకు వచ్చిన బయ్యర్లమని చెప్పుకున్న ఆ ఇద్దరి కదలికలపై మాకు సమాచారం అందింది. దీంతో వారిపై నిఘా పెట్టాం. పక్కాగా ప్లాన్ చేసి స్మగ్లర్లనూ పట్టుకున్నాం. బెల్జియంలో తయారైన ఐదు బుల్లెట్ ఫ్రూఫ్ జాడీల్లో దాచిన విషాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాం. దీని విలువ సుమారు రూ.200 కోట్లు ఉంటుంది. స్మగ్లర్ల విచారణలో బయటపడిందేమంటే..


ఫాన్స్ లో సేకరించిన పాము విషయం మొదట బంగ్లాదేశ్ చేరుతుంది. అక్కడి నుంచి పశ్చిమబంగా మీదుగా భూటన్ కు చేరుస్తారు. అటునుంచి ఆ విషాన్ని చైనాకు తరలిస్తారు. అక్కడ దీనికి భారీ డిమాండ్ ఉంది. కొన్నిరకాల మందులతోపాటు డ్రగ్స్ తయారీకి కూడా పాము విషాన్ని వినియోగిస్తారు. రేవ్ పార్టీల్లో వినియోగించే డ్రగ్స్ ఈ విషంతోనే తయారుచేస్తారని తెలిసింది' అని సంజయ్ దత్ వివరించారు. ఈ రాకెట్ కు సంబంధించి దినాజ్ పూర్ కు చెందిన సంజయ్ కుమార్ దాస్, బిపుల్ సర్కార్, పింటు బెనర్జీ, మాల్దాకు చెందిన అమల్ నుబియాలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని చెప్పారు.

Advertisement
Advertisement