ఉత్తమ్, జానా, షబ్బీర్‌కు ఢిల్లీ పిలుపు | Uttam, Jana, Shabbir was called to Delhi | Sakshi
Sakshi News home page

ఉత్తమ్, జానా, షబ్బీర్‌కు ఢిల్లీ పిలుపు

Jul 15 2015 2:41 AM | Updated on Mar 18 2019 9:02 PM

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ), కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ(సీఎల్‌పీ) ముఖ్యనేతలకు అధిష్టానం నుంచి ....

నేటి సీఎల్‌పీ భేటీ వాయిదా

హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ), కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ(సీఎల్‌పీ) ముఖ్యనేతలకు అధిష్టానం నుంచి మంగళవారం పిలుపు వచ్చింది. ఢిల్లీకి రావాలంటూ అధిష్టానం ఆదేశించింది. దీంతో బుధవారం జరగాల్సిన శాసనసభాపక్ష సమావేశం వాయిదా పడింది. ఏఐసీసీ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ పిలుపు మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనసభ, శాసనమండలిలో ప్రతిపక్ష నాయకులు కె.జానారెడ్డి, షబ్బీర్‌అలీ గురువారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు దిగ్విజయ్‌సింగ్‌తో సమావేశమవుతారు. అనంతరం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతోనూ సమావేశం కానున్నారు. టీపీసీసీ, సీఎల్‌పీలు అనుసరించాల్సిన వ్యూహంతోపాటు పార్టీ పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలపై చర్చించే అవకాశమున్నట్టు పార్టీ ముఖ్యనాయకుడొకరు వెల్లడించారు. ఏఐసీసీలోకి రాష్ట్రం నుంచి తీసుకోవాల్సిన పార్టీ నేతల పేర్లు, ఇతర బాధ్యతల్లోకి ఎవరిని తీసుకోవాలనే అంశాలపై చర్చించవచ్చని చెప్పారు.

 సీఎల్‌పీ నేత మార్పు ఉంటుందా ?
 సీఎల్‌పీ నేతగా ఉన్న జానారెడ్డిని మారుస్తారని కొంతకాలంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ, ప్రభుత్వం పట్ల జానారెడ్డి మెతకవైఖరితో ఉన్నారంటూ ఎమ్మెల్యేలు పలుసార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్న సీఎం కేసీఆర్‌పై ఉదారంగా ఉండటంపై అధిష్టానం పెద్దలకు పలువురు సీనియర్లు ఫిర్యాదులు చేశారు. టీఆర్‌ఎస్‌కు ధీటుగా అసెంబ్లీలో సమాధానం చెప్పగలిగేవారికి సీఎల్‌పీ నేతగా అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు. జానారెడ్డి మార్పు ఉండద ని పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా స్పష్టం చేసినందున సీఎల్‌పీ మార్పు వ్యవహారం చర్చకే రాకపోవచ్చని మరికొందరు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఇటీవల పార్టీ మారిన నేపథ్యంలో జానారెడ్డి లాంటి సీనియర్  నాయకుడిని తప్పించకపోవచ్చని మరో ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement