హార్వీ హరికేన్ సృష్టించిన విలయం నుంచి ఇంకా కోలుకోక ముందే.. అమెరికాను ‘ఇర్మా’ ఉపద్రవం చుట్టుముట్టింది.
- ‘హార్వీ’ విలయం మరువకముందే ‘ఇర్మా’ భయం
- విర్జిన్, కరీబియన్ దీవుల్లో ఎమర్జెన్సీ
తల్లహస్సీ: హార్వీ హరికేన్ సృష్టించిన విలయం నుంచి ఇంకా కోలుకోక ముందే.. అమెరికాను మరో ఉపద్రవం చుట్టుముట్టింది. ఫ్లోరిడా దక్షిణ తీరానికి సుదూరంగా అట్లాంటిక్ సముద్రంలో మరో అతితీవ్ర పెనుతుపాను తలెత్తింది. దీనికి ‘ఇర్మా హరికేన్’ అనే పేరు పెట్టారు.
గడిచిన కొద్ది గంటలుగా ఉధృతంగా మారిన ఇర్మా హరికేన్.. ఫ్లోరిడా వైపుగా కదులుతున్నట్లు జాతీయ హరికేన్ కేంద్ర అధికారులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున ఇది తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు.
కాగా, ప్రస్తుతానికి ఇర్మా హరికేన్‌ను కేటగిరీ 5దిగా గుర్తించామని, దాని చుట్టూ గాలులు సుమారు 280 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయని అధికారులు వివరించారు. ఇర్మా ప్రభావంతో మంగళవారం ఉదయం నుంచి విర్జిన్ దీవులు, పెర్టోరికో, కరీబియన్ దీవులైన అంటిగ్వా, బార్బడోస్‌లలో ఎమర్జెన్సీని ప్రకటించామన్నారు.
గతవారం టెక్సాస్‌లో తీరం దాటిన హార్వీ హరికేన్ భారీ విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. హార్వీ ధాటికి సుమారు 50 మంది మృత్యువాత పడగా, వందలమంది గాయపడ్డారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిన లక్షల మంది ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్నారు. హార్వీ ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న హ్యూస్టన్ నగరం, ఇతర కంట్రీల్లో పునరుద్ధరణ కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. ఇంతలోనే ఫ్లోరిడా తీరంవైపునకు ఇర్మా హరికేన్ దూసుకొస్తుండటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.