ప్రయాణాల్లో ధీమా.. బీమా | Travel Insurance | Sakshi
Sakshi News home page

ప్రయాణాల్లో ధీమా.. బీమా

Oct 20 2013 1:52 AM | Updated on Sep 1 2017 11:47 PM

విదేశీ టూర్లు ప్రస్తుతం సర్వసాధారణంగా మారిపోతున్నాయి. వృత్తిరీత్యా కావొచ్చు లేదా వ్యక్తిగత అవసరాల కోసం కావొచ్చు ..

విదేశీ టూర్లు ప్రస్తుతం సర్వసాధారణంగా మారిపోతున్నాయి. వృత్తిరీత్యా కావొచ్చు లేదా వ్యక్తిగత అవసరాల కోసం కావొచ్చు .. ఇప్పుడు విదేశీ పర్యటనలకి వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశం కాని దేశంలో ఎదురయ్యే సమస్యలనుంచి గట్టెక్కేందుకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఏ విధంగా ఉపయోగపడగలదో తెలియజెప్పేది ఈ కథనం.
 
 విమాన ప్రయాణ చార్జీలు కాస్త అందుబాటులో స్థాయిలో ఉంటుండటంతో సరదాగా సెలవలు గడిపేందుకు ఆగ్నేయాసియా, మధ్య ప్రాచ్య దేశాలకు వెళ్లే టూరిస్టుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలాగే, విద్యాభ్యాసం కోసం కావొచ్చు టూరిజం కోసం కావొచ్చు అమెరికా, బ్రిటన్, కెనడా వంటి పాపులర్ దేశాలు ఎలాగూ ఉన్నాయి. మా అధ్యయనం ప్రకారం ..ఏప్రిల్-జూన్ మధ్య, అక్టోబర్-డిసెంబర్ మధ్య సెలవులు గడిపేందుకు టూరిస్టులు విదేశాలకు వెడుతున్నారు.  జూలై-ఆగస్టు మధ్య కాలంలో కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఎక్కువగా వెడుతున్నారు.
 
 ఇలా వెళ్లినప్పుడు అంతా సజావుగానే సాగిపోవాలని, సాగిపోతుందని ఆశిస్తుంటాం. కానీ అన్ని వేళలూ మనవి కావు కాబట్టి.. కొన్ని సందర్భాల్లో అనుకోని అవాంతరాలు ఎదురవచ్చు. ఉదాహరణకు అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడవచ్చు. లేదా బ్యాగేజీ పోవచ్చు. ఒక్కోసారి పాస్‌పోర్టు పోవచ్చు. ఇలా ఏదైనా జరగొచ్చు. విదేశీ టూర్లలో ఎదురయ్యే అవాంతరాల్లో ఈ మూడు అంశాలు ప్రధానంగా ఉంటున్నాయి.  క్లెయిముల్లో సుమారు 64% వైద్య చికిత్స వ్యయాలకు సంబంధించినవే ఉన్నాయి. సాధారణంగా విదేశాల్లో వైద్య చికిత్సకయ్యే వ్యయాలు చాలా భారీగా ఉంటాయి. ఉదాహరణకి జ్వరం వచ్చి ఒక మూడు రోజుల పాటు ఆస్పత్రిలో గడపాల్సి వస్తే.. దాదాపు రూ. 5 లక్షల దాకా ఖర్చు కావచ్చు. ఇక వైద్యాన్ని పక్కన పెట్టి అత్యవసరంగా స్వదేశానికి తరలించాల్సి వస్తే.. ఎకానమీ ఫ్లయిట్‌లో వచ్చినా కూడా సుమారు రూ. 3 లక్షల దాకా ఖర్చవుతోంది.
 
 ఇవి కాకుండా.. ఫ్లయిట్ ఆలస్యం కావడం, లేదా సర్వీస్ రద్దు కావడం వంటివి సర్వసాధారణంగా ఎదురయ్యే సమస్యల్లో మరికొన్ని. విదేశీ ప్రయాణాలు చేసేవారిలో దాదాపు 10 శాతం మంది ఇలాంటి సమస్యను ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొనే ఉంటారు. ఇలాంటప్పుడు పర్యటనను రీషెడ్యూలింగ్ చేసుకోవాలంటే... భారీగానే ఖర్చవుతుంది. ఇలాంటి సందర్భాల్లోనే ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలు అక్కరకొస్తుంటాయి. ఈ అంశాలను గుర్తించే.. విద్యార్థులకు సంబంధించి చాలా మటుకు యూరోపియన్ దేశాలు ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలను తప్పనిసరి చేశాయి. విదేశీ పర్యటనలకే కాకుండా దేశీ పర్యటనల్లో కూడా అనేక సమస్యలు ఎదురుకావొచ్చు. కనుక మీ ప్రయాణావసరాలను బట్టి తగిన ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారంటే ఎలాంటి అవాంతరాలు ఎదురైనా నిశ్చింతగా టూర్లను పూర్తి చేసుకురావచ్చు.
 - సందీప్ మాలిక్, ట్రావెల్ ఇన్సూరెన్స్ విభాగం హెడ్, బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్

Advertisement
Advertisement