
సిటీలో అంత సీన్‌లేదు
హైదరాబాద్ నగర శివారు భూములకు ఉన్న డిమాండ్ నగర నడిబొడ్డున ఉన్న భూములకు లేదనే విషయం తెలంగాణ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీఎస్‌ఐఐసీ) నిర్వహించిన వేలంలో స్పష్టమైంది.
శివారు భూములకు రికార్డు స్థాయిలో ధర
నగర నడిబొడ్డున ఉన్న భూములకు స్పందన శూన్యం
హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివారు భూములకు ఉన్న డిమాండ్ నగర నడిబొడ్డున ఉన్న భూములకు లేదనే విషయం తెలంగాణ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీఎస్‌ఐ ఐసీ) నిర్వహించిన వేలంలో స్పష్టమైంది.
శివారు భూములు పరిశ్రమల స్థాపనకు ఉపయోగంగా ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరగటంతోపాటు గతంలో ఎన్నడూ లేని రికార్డు స్థాయి ధర నమోదైంది . నగర నడిబొడ్డున ఉన్న భూమిని వేలానికి పెట్టినా.. కొనుగోలు చేయటానికి ఎవ్వరూ ముందుకు రాకపోవటంతో మళ్ళీ వేలం పాటకు సిద్ధం కావాలని భావిస్తున్నారు.
హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోని 27 ప్రాంతాల్లో గుర్తించిన 98.70 ఎకరాల ప్రభుత్వ భూమిను టీఎస్‌ఐఐసీ గత నెల 30న ఇచ్చిన ఈ టెండర్ కమ్ ఈ వేలం ప్రకటన ద్వారా బుధవారం వేలం నిర్వహించిన విష యం తెలిసిందే. ఈ వేలంలో నగర శివారులోని రాయదుర్గం, కోకాపేట, మణికొండ ప్రాంతాలలోని ప్రభుత్వ భూములకు రికార్డు స్థాయిలో ధర పలుకగా, నగర నడి బొడ్డు ప్రాంతాలైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లలోని భూముల వేలంలో ఎవ్వరు పాల్గోన లేదు.
రాయదుర్గంలో ఎకరాకు రికార్డు స్థాయిలో రూ.29.28 కోట్లు ధర నిర్ణయం కాగా, ఇక్కడనే మరో బిట్‌లో ఉన్న ప్రభుత్వ భూములకు ఎకరానికి రూ. 24.20 కోట్లు పలికింది. మణికొండ ,కొకాపేటల్లో ఉన్న భూములకు కూడా ఎకరాకు రూ. 12.63 కోట్లు ధర నమోదైంది.బంజారా హిల్స్, జూబ్లీహిల్స్‌ల్లోని 10 ప్రాంతా ల్లో ఉన్న 3.25 ఎకరాల ప్రభుత్వ భూమిని కొనుగోలు చేయటానికి మాత్రం ఎవ్వరూ ముందుకు రాలేదు.
ఇక్కడి 3.25 ఎకరాల భూమికి రూ. 100 కోట్లు రాగలవని గతంలో రెవెన్యూ యంత్రాంగం అంచనా కూడా వేసింది. 3.25 ఎకరాల భూమి పది ప్రాంతాల్లో చిన్న,చిన్న బిట్లుగా ఉండటం వల్ల ముందుకు రాలేదని తెలుస్తోంది.మళ్లీ వేలం నిర్వహించనున్నట్లు తెలిసింది.