ఎందుకంత అష్టదిగ్బంధనం?

ఎందుకంత అష్టదిగ్బంధనం? - Sakshi

న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం సీరియస్‌గా ఉందని తెలిసినప్పటి నుంచి ఆమె చికిత్స పొందుతున్న ఆపోలో ఆస్పత్రి దారులను ఎందుకు అస్టదిగ్బంధం చేశారు? తమిళనాడులో రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు? అవసరమైతే కావాల్సినన్ని కేంద్ర బలగాలను పంపించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రకటించింది? అన్న సందేహాలు కలగడం సహజమే. జయలలిత పట్ల ప్రజల్లో వ్యక్తిగతంగా ఉన్న ఆరాధ్య భావన లేదా వ్యక్తిగత ఆరాధన విపరీత పరిణామాలకు ఎక్కడ దారితీస్తుందన్న ఆందోళనతోనే ఈ ముందు జాగ్రత్త ఏర్పాట్లు చేశారన్నది సుస్పష్టం. 

 

2014లో ఓ అవినీతి కేసులో జయలలితకు బెంగళూరు కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించినప్పుడు తమిళనాడులో 16 మంది పిచ్చి అభిమానులు ఆత్మహత్య చేసుకున్నారు. 1987లో అప్పడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎంజీ రాంచంద్రన్ చనిపోయినప్పుడు 31 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రెందు విషాధ సంఘటనల్లోనూ మరణించిన వారిలో ఎక్కువ మంది ఆత్మాహుతి చేసుకున్నవారే. భావోద్వేకంతో అనవసరంగా ప్రాణాలు తీసుకోవడం అనే సంస్కృతి ఒక్క తమిళనాడులోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలు చనిపోయినప్పుడు, హర్యానాలో చౌతాలాలు జైలు కెళ్లినప్పుడు వారి అభిమానులు ఇతరుల ప్రాణాలను, ఆస్తులను ధ్వంసం చేశారుతప్ప, స్వయంగా ప్రాణాలు తీసుకోవడానికి ఎవరూ ప్రయత్నించలేదు. 

 

తమిళనాడులోవున్న ఈ ప్రత్యేక సంస్కృతి కారణంగానే ఎల్‌టీటీఈలో ఆత్మాహుతి బాంబర్లు తయారయ్యారనే వాదన కూడా బలంగా ఉంది. పైగా వీరికి పిచ్చి అభిమానం విషయంలో తర, తమ, మత, రాష్ట్ర, ప్రాంత భేదాలు కూడా లేవని తెలుస్తోంది. మహారాష్ట్రలో పుట్టిన రజనీకాంత్, నఖత్ ఖాన్ (కుష్బూ)లను ఆరాధ్య దేవతలుగా చూడడమే ఈ విషయాన్ని నిరూపిస్తోంది. వీరిలో ఉన్న గుడ్డి ప్రేమను తమిళ రాజకీయ పార్టీలన్నీ వాడుకునేందుకు ప్రయత్నించాయన్నది తమిళ రాజకీయాలే తెలియజేస్తాయి. 2014లో తన కోసం ఆత్మాహుతి చేసుకున్న 16 మంది కుటుంబాలకు జయలలిత నష్టపరిహారం చెల్లించడం, అన్నం, ఉప్పు, పప్పు కాడి నుంచి అన్ని స్కీమ్‌లకు ‘అమ్మ’ పేరు పెట్టడం ఈ గుడ్డి ప్రేమను పెంచడం కోసమేనన్న విమర్శలు ఉన్నాయి. కరుణానిధి కూడా తాను అధికారంలో ఉన్నప్పుడు పేదల జీవిత బీమా పథకానికి తన పేరు స్ఫురించేలా కలైగర్ అని పేరు పెట్టారు. అంటే కళాకారుడు అని అర్థం. ఆ పేరుతోని ఆయన ప్రసిద్ధుడు. 

 

ఒకరికోసం ప్రాణం ఇవ్వడం అంటే ఆ వ్యక్తిని రక్షించడం కోసమో, అన్ని విధాల ఆదుకోవడం కోసమో ప్రాణాలకు తెగించడమని అర్థంకాని ఇలా అనవసరంగా స్వీయ ప్రాణాలను తీసుకోవడం కాదనేది తమిళ ప్రజలు ఎప్పుడు అర్థం చేసుకుంటారో!
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top