‘జువనైల్’ వయసు16కు తగ్గింపు

‘జువనైల్’ వయసు16కు తగ్గింపు


* బాల నేరస్తుల సవరణ బిల్లుకు రాజ్యసభ ఓకే

* వామపక్షాల వాకౌట్; కలిసొచ్చిన కాంగ్రెస్

* బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలన్న సీపీఎం, ఎన్సీపీ, డీఎంకే

* ‘జువనైల్’ వయస్సు 16కు తగ్గింపు

* రేప్ లాంటి హేయ నేరాలకు పాల్పడే 16 -18 ఏళ్ల పిల్లలకు కఠిన శిక్షలు

* చర్చను గ్యాలరీ నుంచి వీక్షించిన ‘నిర్భయ’ తల్లిదండ్రులు


 

న్యూఢిల్లీ: అత్యంత హేయమైన నేరాలకు పాల్పడిన 16 నుంచి 18 ఏళ్ల వయసున్న మైనర్లను పెద్దలకు ఉద్దేశించిన చట్టాల ప్రకారం విచారించాలన్న సవరణతో కూడిన జువనైల్ జస్టిస్ బిల్లుకు మంగళవారం రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. అంతకుముందు, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో వామపక్షాలు సభనుంచి వాకౌట్ చేశాయి.



లోక్‌సభలో ఇప్పటికే ఆమోదం పొందిన ఈ బిల్లు రాష్ట్రపతి రాజముద్రతో త్వరలో చట్టరూపం దాల్చనుంది. దీని ప్రకారం ఇకపై హత్య, రేప్ వంటి పాశవిక నేరాలకు పాల్పడిన 16 ఏళ్ల పైబడిన మైనర్లకు వయోజనులకుద్దేశించిన చట్టాల ప్రకారమే శిక్ష విధిస్తారు. ఢిల్లీ గ్యాంగ్‌రేప్ దోషి జువనైల్ చట్టం ప్రకారం మూడేళ్ల శిక్షే అనుభవించి ఆదివారం విడుదలవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమైన నేపథ్యంలో.. బాలనేరస్తుల చట్ట సవరణ బిల్లు ఆమోదం విషయంలో అధికారపక్ష, విపక్షాలపై ఒత్తిడి నెలకొంది.



బిల్లుపై చర్చను ఢిల్లీ గ్యాంగ్‌రేప్ బాధితురాలు ‘నిర్భయ’ జ్యోతిసింగ్ తల్లిదండ్రులు ఆశాదేవి, బద్రీసింగ్ పాండేలు గ్యాలరీ నుంచి ప్రత్యక్షంగా వీక్షించారు. బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ ఆమోదం ఆర్నెళ్ల క్రితమే జరిగుంటే నా కూతురిపై అత్యంత పాశవికంగా దాడి చేసినవాడు విడుదలై ఉండేవాడు కాద’ని ఆశాదేవి అన్నారు.

 

15 ఏళ్ల బాలుడు ఈ నేరం చేస్తే..?

‘జువనైల్ జస్టిస్(కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రెన్) బిల్’ను మహిళ, శిశు అభివృద్ధి మంత్రి మేనకా గాంధీ సభలో ప్రవేశపెట్టారు. మరింత అధ్యయనం అవసరమంటూ సీపీఎం, ఎన్సీపీ, డీఎంకే తదితర పార్టీలు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని కోరాయి. రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ చర్చను ప్రారంభిస్తూ.. ఈ బిల్లు ఆమోదం పొందడం అత్యంత ఆవశ్యకమన్నారు. ‘నిర్భయ తల్లిదండ్రులు.. ముఖ్యంగా  తల్లి ఆశాదేవి.. తన కూతురి గురించే కాకుండా, దేశంలో మరో నిర్భయ ఘటన జరగొద్దనే పట్టుదలతో పోరాటం చేస్తున్నారు’ అని ప్రశంసించారు.



‘రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నసమయంలో బాల నేరస్తుల చట్టం వచ్చింది. అప్పుడు కనీస వయస్సుగా 16 ఏళ్లనే నిర్ధారించారు. ఆ తరువాత 2000 సంవత్సరంలో ఎన్డీయే ప్రభుత్వం దాన్ని 18 ఏళ్లకు పెంచింది. ఇప్పుడు మళ్లీ రాజీవ్ ప్రతిపాదించిన 16 ఏళ్లకు మారుస్తోంది’ అన్నారు. సెంటిమెంట్ ఆధారంగా చట్టాలు చేయడం సరికాదని, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు.



‘ఒకవేళ 15 ఏళ్ల 11 నెలల వయసున్న బాలుడు ఇలాంటి నేరానికి పాల్పడితే.. మళ్లీ జువనైల్ నిర్వచనాన్ని మారుస్తారా? ఉగ్రవాద సంస్థ ఐఎస్ 14 ఏళ్ల పిల్లలను కూడా చేర్చుకుంటోంది. జువనైల్ వయస్సును 14కు తగ్గిస్తారా?’ అని ప్రశ్నించారు.

 

సమగ్రం.. సంవేదనాత్మకం.. బిల్లు సంవేదనాత్మకంగానూ, సమగ్రంగానూ ఉందని మేనక  పేర్కొన్నారు. బాలలు పాల్పడుతున్న తీవ్రమైన నేరాల సంఖ్య  గణనీయంగా పెరుగుతోందని గణాంకాలతో  వివరించారు. ఒక్క ఢిల్లీలోనే రేప్ తరహా నేరాలకు పాల్పడి, అరెస్టైన 16 ఏళ్లు పైబడిన బాలుర సంఖ్య వెయ్యికి పైగా ఉందన్నారు. ‘నిర్భయ కేసులో దోషిగా తేలిన బాలనేరస్తుడి విషయంలో ప్రస్తుతం మనమేం చేయలేకపోవచ్చు. కానీ ఈ బిల్లుతో ఇంకెందరో బాలలు అలాంటి ఘాతుకాలకు పాల్పడకుండా అడ్డుకోగలం’ అన్నారు.



ఈ బిల్లు యూపీఏ హయాంనాటిదేనని గుర్తు చేశారు. ఇది బాలల భద్రతకు, పరిరక్షణకు ఉద్దేశించినదన్నారు. రూపకల్పన సమయంలో నిర్భయ కేసును విచారించిన ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జీల సూచనలను తీసుకున్నామన్నారు. అవిద్య, పేదరికమే ఇలాంటి నేరాలకు కారణమనలేమని చదువుకున్నవారు, సంపన్నుల పిల్లలూ ఈ నేరాలకు పాల్పడుతున్నారన్నారు.



స్వీడన్ లాంటి సంపన్న దేశంలోనూ మైనర్లు రేప్‌లకు పాల్పడుతున్న ఘటనలున్నాయన్నారు. త్వరలో ప్రతీగ్రామంలోనూ ప్రత్యేక మహిళా పోలీసు అధికారులను నియమిస్తామన్నారు. బిల్లు ఆమోదం పొందడంలో సహకరించిన విపక్షాలక కృతజ్ఞతలు తెలిపారు.

 

మేనకా గాంధీ వివరించిన బిల్లులోని కీలకాంశాలు..

నిందితుడైన ఏ ఒక్క బాలుడు నేరుగా జైలుకు వెళ్లడు. మొదట ఆ బాలుడు.. చిన్నపిల్లల చేష్టగా భావించి నేరం చేశాడా? లేక పెద్దల తరహా మనస్తత్వంతో నేరానికి పాల్పడ్డాడా? అనేది జువనైల్ జస్టిస్ బోర్డులోని మానసిక నిపుణులు నిర్ధారిస్తారు.

 

దోషిగా నిర్ధారించిన తరువాత మొదట అతడిని బాలనేరస్తుల పరివర్తన కేంద్రం(బోర్స్టల్)కు పంపిస్తారు. 21 ఏళ్ల వయసు వచ్చిన తరువాత ఆతడి మానసిక ఆరోగ్యం, సామాజిక స్పందనలను పరీక్షిస్తారు. ఆ తరువాత పెద్దల జైలుకు పంపే విషయంలో నిర్ణయం తీసుకుంటారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top