ప్రభుత్వ ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడుకున్నదని, కీలకమైన శాఖల్లో పనిచేసే అఖిల భారత స్థాయి అధికారులు మరింత బాధ్యతగా ప్రవర్తించి ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సూచించారు.
	- సివిల్ సర్వీసెస్ అధికారులతో గవర్నర్ నరసింహన్
	- కంప్యూటర్లతో కుస్తీ పట్టొద్దు
	- క్షేత్రస్థాయికి వెళ్లి వాస్తవ పరిస్థితులను తెలుసుకోండి
	- ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీల స్పెషల్ ఫౌండేషన్ కోర్సు ప్రారంభం
	
	 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడుకున్నదని, కీలకమైన శాఖల్లో పనిచేసే అఖిల భారత స్థాయి అధికారులు మరింత బాధ్యతగా ప్రవర్తించి ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సూచించారు. సమస్యల పరిష్కారానికి సంబంధించి అధికారుల నుంచి భరోసా లభించినప్పుడే ప్రజలకు వారిపై నమ్మకం కలుగుతుందని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నూటికి నూరు శాతం పూర్తి చేయాలని చెప్పారు. ఆలిండియా సివిల్ సర్వీసెస్ అధికారుల కోసం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ) రూపొందించిన స్పెషల్ ఫౌండేషన్ కోర్సును సోమవారం ఆయన ప్రారంభించారు. కోర్సు చేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి 2012-13 బ్యాచ్‌కు చెందిన 141 మంది ఐఈఎస్, ఐఎస్‌ఎస్ అధికారులు హాజరయ్యారు.
	 
	 ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరును పర్యవేక్షించేందుకు కంప్యూటర్లపై ఆధారపడొద్దని, క్షేత్రస్థాయి పర్యటనలు చేసి వాస్తవాలను తెలుసుకోవాలని చెప్పారు. ప్రజలకు సేవ చేయడంలో కీలకంగా వ్యవహరించే సివిల్ సర్వీసెస్ అధికారులు, సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లపైనా దృష్టి సారించాలన్నారు. తోటి ఉద్యోగులు, అధికారులను కలుపుకుని ప్రజలకు సంతృప్తినిచ్ఛేలా వ్యవహరించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను నిరోధించాలంటే.. పట్టణాల్లో లభించే వసతులను పల్లెలకు తీసుకెళ్లాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని(టెక్నాలజీ) మంచి పనుల కోసమే వినియోగించాలని కోరారు. ప్రజాప్రతినిధులు పథకాలను రూపొందిస్తే వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని, వారు ఆశించిన మేరకు పనిచేస్తేనే సార్థకత ఉంటుందన్నారు. ప్రజలకు తప్పనిసరిగా కావాల్సిన ఆహారం, ఉపాధి, విద్య, ఆరోగ్యం అందించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని గవర్నర్ సూచించారు.
	 
	 సర్వీసులో మొదటి 12 ఏళ్లే కీలకం
	 సివిల్ సర్వీసు అధికారులకు తమ సర్వీసులోని మొదటి 10 నుంచి 12 ఏళ్లు ఎంతో కీలకమని గవర్నర్ నరసింహన్ చెప్పారు. ఇతరుల నుంచి నైపుణ్యాలను గ్రహించేందుకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచాలని, ఇందుకోసం పరిశోధనలకు ప్రాధాన్యత నివ్వాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో నీటి కొరతను అధిగమించేందుకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్‌పై దృష్టి పెట్టాలన్నారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ డెరైక్టర్ జనరల్ వినోద్ కుమార్ అగ్రవాల్ మాట్లాడుతూ.. సివిల్ సర్వీసెస్ అధికారులకు అందిస్తున్న ప్రత్యేక ఫౌండేషన్ కోర్సు వలన నైపుణ్యంతో పాటు బహుళ ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో అదనపు డీజీ తిరుపతయ్య, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
