విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం షాక్ ఇవ్వబోతోంది. ‘ట్రూ-అప్’ చార్జీల పేరుతో ఏకంగా రూ.5,868 కోట్ల మేరకు జనంపై భారం వేసేందుకు కసరత్తు చేస్తోంది.
రూ. 5,868 కోట్ల వసూలుకు సర్కారు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం షాక్ ఇవ్వబోతోంది. ‘ట్రూ-అప్’ చార్జీల పేరుతో ఏకంగా రూ.5,868 కోట్ల మేరకు జనంపై భారం వేసేందుకు కసరత్తు చేస్తోంది. దక్షిణ (ఎస్పీడీసీఎల్), తూర్పు (ఈపీడీసీఎల్) ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) ఈ మేరకు కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఎదుట పిటిషన్లు దాఖలు చేశాయి. ఇటీవలి ఈఆర్‌సీ సమన్వయ కమిటీ సమావేశంలో డిస్కమ్‌ల సీఎండీలు ప్రధానంగా దీనిపైనే పట్టుబట్టారు.
గడచిన ఐదేళ్ల ట్రూ ఆప్ చార్జీలను వడ్డీతో సహా ప్రజల నుంచి వసూలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఏపీఈఆర్‌సీ అనుమతిస్తే వచ్చే ఏడాది విద్యుత్ బిల్లులు బాంబుల్లా పేలనున్నాయి. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో ఒక్కసారి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదు. ట్రూ అప్ తరహా వసూలు ప్రతిపాదనలను ఆయన నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు ప్రజల వద్ద సర్దుబాటు చార్జీలు (ఎఫ్‌ఎస్‌ఏ) వసూలు చేశాయి. న్యాయస్థానం సర్దుబాటు చార్జీలను తప్పుబట్టింది.
ఇక రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన బాబు సర్కార్ గత ఏప్రిల్‌లో ఏకంగా రూ.941 కోట్ల మేరకు విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై భారం వేసింది. తాజాగా ట్రూ అప్ చార్జీలకు సిద్ధమవుతోంది.దీంతో విద్యుత్ బిల్లులు ఐదారు రెట్లు పెరుగుతాయని అధికారుల మాట. ప్రతిపాదిత మొత్తం ఖర్చుకన్నా అదనంగా అయ్యే వ్యయాన్ని (కమిషన్ అమోదించిన, వాస్తవ ఖర్చుకు మధ్య తేడా) రాబట్టుకోవడాన్ని ట్రూ అప్‌గా పేర్కొంటారు.