రాష్ట్రాల సమస్యలపై పంచాయితీ! | Panchayat On States issues! | Sakshi
Sakshi News home page

రాష్ట్రాల సమస్యలపై పంచాయితీ!

Dec 25 2015 1:03 AM | Updated on Sep 3 2017 2:31 PM

రాష్ట్రాల్లో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలను... ఇరుగుపొరుగు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

నీతి ఆయోగ్ మధ్యవర్తిత్వంలో చర్చలు.. కేంద్రం కొత్త ప్రయోగం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాల్లో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలను... ఇరుగుపొరుగు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు మధ్యవర్తిత్వం వహించే బాధ్యతను ప్రణాళికా సంఘం స్ధానంలో ఏర్పడ్డ నీతి ఆయోగ్‌కు అప్పగించింది. జనవరి మొదటి లేదా రెండో వారంలో రాష్ట్రాలవారీగా ఉన్నతాధికారులతో సమావేశమై చర్చలు జరపాలని సూచించింది. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ అరవింద్ పనగరియా అధ్యక్షతన ఢిల్లీలో ఈ సమావేశాలు జరుగనున్నాయి.

ఈ భేటీలకు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతోపాటు వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు హాజరు కావాలని కేంద్రం ఆహ్వానించింది. రాష్టాల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు వీలుగా ఆయా సమస్యలతో సంబంధమున్న కేంద్ర మంత్రిత్వశాఖల ముఖ్య కార్యదర్శులు కూడా సమావేశాలకు విధిగా హాజరు కావాలని ఆదేశించింది. కేంద్ర ఉన్నతాధికారులు, రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో చర్చలు జరిపితే కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారమయ్యే అవకాశాలుంటాయని కేంద్రం భావిస్తోంది.

నీతి ఆయోగ్ అధ్వర్యంలో జరిగే ఈ భేటీలో మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్ర అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన ఆహ్వానం రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్లే బృందానికి రాష్ట్ర ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య నేతృత్వం వహిస్తారు. రాష్ట్ర విభజనతో ముడిపడిన వివిధ అంశాలపై తెలంగాణ, ఏపీల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏడాదిన్నర వ్యవధిలో కొన్ని పరిష్కారమైనప్పటికీ.. మరికొన్ని ఇప్పటికీ పరిష్కారం కాలేదు.

ప్రధానంగా విద్యుత్, సాగునీటిపారుదల, విద్య, వైద్యం, మౌలిక వసతులు, రోడ్లు భవనాలు, జాతీయ రహదారుల రంగాలతోపాటు ఉమ్మడి హైకోర్టు విభజన, ఉద్యోగుల పంపకాలు తదితరాంశాల్లో తెలంగాణ, ఏపీ మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు నెలకొన్నాయి. ఆర్థికపరమైన వ్యవహారాలు సైతం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ఢిల్లీలో జరిగే భేటీ సందర్భంగా ఈ అంశాలన్నింటిపై కేంద్ర రాష్ట్ర ఉన్నతాధికారులు సమగ్రంగా చర్చించనున్నారు.

సమస్యలున్న విభాగాలకు చెందిన ఉన్నతాధికారులందరూ ఈ సమావేశాలకు హాజరవుతారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన సమస్యలన్నింటినీ నీతి ఆయోగ్ దృష్టికి తీసుకెళ్లేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు సిద్ధం చేస్తోంది. సమస్యలు, సంబంధిత వివరాలతో నివేదికలు తయారు చేయాలంటూ రాష్ట్ర ప్రణాళికశాఖ అన్ని శాఖలకు సమాచారం చేరవేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement