గోమాంసం తిన్నారనే ఆరోపణతో ఉత్తరప్రదేశ్‌లో బిషాదా గ్రామంలో ఇఖ్లాక్ అనే వ్యక్తిని కొట్టిచంపిన ఘటన రాజకీయ దుమారం రేపుతోంది
దాద్రి/లక్నో: గోమాంసం తిన్నారనే ఆరోపణతో ఉత్తరప్రదేశ్‌లో బిషాదా గ్రామంలో ఇఖ్లాక్ అనే వ్యక్తిని కొట్టిచంపిన ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. ఆరోపణల నుంచి బయటపడేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా.. విపక్షాలు మాత్రం దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇది ముందస్తు ప్రణాళికతోనే చేసిన హత్య అని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ప్రతి చిన్నవిషయానికి ట్వీట్లు చేసే ప్రధాని మోదీ.. దీనిపై స్పందించడం లేదేమని కాంగ్రెస్ విమర్శించింది. ఈ ఘటనకు మతంరంగు పులమవద్దని కేంద్ర మంత్రి మహేశ్ శర్మ అన్నారు. శుక్రవారం ఆయన ఇఖ్‌లాక్ కుటుంబాన్ని పరామర్శించారు. సీబీఐ విచారణ జరిపిస్తామని చెప్పారు.
ఇక ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇఖ్లాక్ కుమారుడు డానిష్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కాగా, అసదుద్దీన్ ఒవైసీ కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మహమ్మద్ ఇఖ్లాక్ మతమే అతని మృతికి కారణమని, ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్య అని ఆయన ఆరోపించారు.