బోగస్‌ ’ఐడీఎస్’ లక్ష్మణరావు మోసపోయాడట!

బోగస్‌ ’ఐడీఎస్’ లక్ష్మణరావు మోసపోయాడట! - Sakshi


సాక్షి, హైదరాబాద్‌: స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకంలో (ఐడీఎస్) రూ.10 వేల కోట్లు నల్లధనం తన వద్ద ఉన్నట్లు డిక్లేర్ చేసి, పన్ను చెల్లింపు దగ్గరకు వచ్చేసరికి ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారుల్ని ముప్పతిప్పలు పెట్టిన బాణాపురం లక్ష్మణరావు వెనుక ఉన్న బడాబాబులు’ వెలుగులోకి రానట్లేనా..? ఔననే అనుమానాలు కలుగుతున్నాయి. సాక్షాత్తు ఐటీ అధికారులే ఇతడు మోసపోయినట్లు’ నిర్థారించడమే దీనికి కారణం. ఈ మేరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌కు (సీసీఎస్) గురువారం లేఖ రాసిన ఐటీ విభాగం.. లక్ష్మణరావును మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది. ఈ లేఖను అనధికారంగా తిరస్కరించిన సీసీఎస్ పోలీసులు బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు. ఐటీ అధికారుల నుంచి తమకు లేఖ అందిందని సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి సాక్షి’కి తెలిపారు. (ఆ 10 వేల కోట్లు బోగస్!)



ఐడీఎస్ పథకం కింద సెప్టెంబర్ ఆఖరు వరకు దేశ వ్యాప్తంగా ప్రకటించిన భారీ మొత్తాల్లో నగరం నుంచి డిక్లేర్ చేసిన రూ.10 వేల కోట్లు కూడా ఉంది. దీనిపై అప్పట్లో కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశాయి. అయినప్పటికీ రెండు నెలల వరకు రూ.10 వేల కోట్లు డిక్లేర్ చేసింది ఎవరనేది ఐటీ అధికారులు బయటకు చెప్పలేదు. సెప్టెంబర్ 30 వరకు డిక్లేర్ చేసిన మొత్తానికి సంబంధించి నల్లబాబులు’ పన్ను/సర్‌చార్జ్‌ల్ని మూడు విడతల్లో 2017 మార్చి నాటికి చెల్లించాల్సి ఉంది. మొదటి వాయిదా అయిన రూ.1125 కోట్లు చెల్లించలేక చేతులెత్తేయడంతోనే లక్ష్మణరావు పేరు వెలుగులోకి వచ్చింది. ఫిల్మ్‌నగర్‌లోని అతడి ఇంటితో పాటు మరో ఇద్దరి ఇళ్ళపై దాడులు చేసి ఐటీ అధికారులు కొండను తవ్వి ఎలుకను పట్టారు’. మోసపోయినట్లు అనధికారిక నిర్థారణ... సోదాల నేపథ్యంలో ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయిన ఐటీ అధికారులు లక్ష్మణరావును విచారించారు. (బాణాపురం లక్ష్మణ్‌రావు ఇంట్లో చిల్లి గవ్వ కూడా దొరకలేదు)



ఈ నేపథ్యంలోనే ఇతడు తాను ఓ బాబాతో పాటు మరికొందరి మాటలు నమ్మానంటూ ఐటీ అధికారులకు సినిమా చూపించాడు. రైల్ పుల్లింగ్ కాయిన్స్/బౌల్స్‌ను సేకరించి ఇస్తానని చెప్పిన ఓ బాబా మాటలు నమ్మానంటూ చెప్పుకొచ్చాడు. వాటిని అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించడం ద్వారా రూ.10 వేల కోట్లు సంపాదించవచ్చంటూ వారు చెప్పిన నేపథ్యంలోనే ఆ మేరకు డిక్లేర్ చేశానంటూ ఐటీ అధికారులకు తెలిపాడు. దీన్ని గుడ్డిగా నమ్మిన ఐటీ అధికారులు సదరు బాబా ఎవరు? వీరికి దళారులుగా వ్యవహరించింది ఎవరు? తదితర అంశాలను గుర్తించేందుకు పూర్తిస్థాయిలో ప్రయత్నాలు చేయలేదు.



ఆర్థిక చట్ట ప్రకారం ఇలాంటి బోగస్ డిక్లరేషన్ చేసిన వారిపై కేసు నమోదు చేసి, ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉన్నా... ఇప్పటి వరకు అలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కేవలం లక్ష్మణరావు చెప్పిన మాటల్నే పరిగణలోకి తీసుకున్న ఐటీ అధికారులు అతడు మోసపోయినట్లు అనధికారంగా నిర్థారించేశారు. సీసీఎస్‌లు లేఖ రాసిన ఐటీ... లక్ష్మణరావు వ్యవహారాన్ని లోతుగా దర్యాప్తు చేయడం, అతడిపై ఆర్థిక చట్టం కింద కేసులు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయడాన్ని పక్కన పెట్టిన ఐటీ అధికారులు అతడి పైనే సానుభూతి చూపడం ప్రారంభించారు. రైస్ పుల్లింగ్ సహా ఇతర పేర్లతో లక్ష్మణరావును మోసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏకంగా సీసీఎస్ పోలీసులకు లేఖ రాశారు. ఈ లేఖను చూసి అవాక్కైన అధికారులు బాధితుడు కాకుండా మూడో వ్యక్తి/సంస్థ రాసిన లేఖను ఫిర్యాదుగా స్వీకరించలేమని ఐటీ అధికారులకు స్పష్టం చేశారు. లక్ష్మణరావు మోసం చేశాడని భావిస్తే అతడిపై ఫిర్యాదు చేయాలని, మోసపోయాడనే అభిప్రాయం ఉంటే నేరుగా వచ్చి ఫిర్యాదు చేసేలా సూచించాలని స్పష్టం చేశారు. బాధితుడే వచ్చి ఫిర్యాదు చేయడంతో పాటు ప్రాథమిక ఆధారాలు సమర్పిస్తేనే తదుపరి చర్యలు తీసుకోగలమని ఐటీ అధికారులకు చెప్పారు. దీంతో చేసేది లేక ఐటీ అధికారులు తిరిగి వెళ్ళినట్లు సమాచారం.



‘బడాబాబులకు’ బినామీ..!

ఐడీఎస్ లక్ష్మణరావు పేరు వెలుగులోకి వచ్చిన తొలి రోజునే అనేక కథనాలు బయటకు వచ్చాయి. కొందరు ‘బడాబాబులకు’ ఇతడు బినామీ అని, వారి నల్లధనాన్నే మార్చేందుకు తనకు చెందినదిగా డిక్లేర్ చేశారని వినిపించింది. అయితే సెప్టెంబర్ 30తో ఐడీఎస్ స్కీమ్ ముగియగా... నవంబర్ 8న డీమానిటైజేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో సదరు బడాబాబుల’ అంచనాలు తారుమారైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పన్ను కట్టలేక లక్ష్మణరావును చేతులెత్తేయమని చెప్పారని తెలిసింది. అతడికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సహకరిస్తామంటూ హామీ సైతం ఇచ్చినట్లు సమాచారం. లక్ష్మణరావుకు సంబంధించి వినిపిస్తున్న కథనాలు, అతడి గత చరిత్రను పరిగణలోకి తీసుకోని ఐటీ అధికారులు కొత్త పల్లవి అందుకున్నారు. ఓ బాబాతో పాటు కొందరి చేతిలో లక్ష్మణరావు మోసపోయాడని, వారి మాటలు నమ్మి రూ.లక్షల్లో పోగొట్టుకున్నాడటం సానుభూతి చూపించడం ప్రారంభించారు. లక్ష్మణరావు కథలో ఐటీ విభాగం నుంచి ఈ ట్విస్ట్ రావడానికి బడాబాబులు’ తీసుకువచ్చిన ఒత్తిడే కారణమని తెలుస్తోంది. నిందితుడిగా చేర్చాల్సిన వ్యక్తిని బాధితుడిగా మార్చడం వెనుక ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top