ఆ 10 వేల కోట్లు బోగస్!

ఆ 10 వేల కోట్లు బోగస్! - Sakshi

- ఐడీఎస్ కింద వేల కోట్లు ఉన్నట్టు వెల్లడించిన హైదరాబాదీ లక్ష్మణ్‌రావు

- మొదటి వాయిదా చెల్లించకపోవడంతో ఐటీ దాడులు

- ఫిల్మ్‌నగర్‌లోని ఆయన ఇంట్లో సోదాలు

- లక్ష్మణ్‌రావు సీఏ నివాసంపైనా దాడి.. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

 

సాక్షి, హైదరాబాద్: గుజరాత్‌లో మహేశ్ షా అనే బడా వ్యాపారి స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం(ఐడీఎస్) కింద రూ.13,860 కోట్లు ప్రకటించి కేంద్రానికి కట్టాల్సిన వారుుదా దగ్గరికి వచ్చేసరికి చేతులెత్తేసిన తరహాలోనే హైదరాబాద్‌లో ఓ ఉదంతం వెలుగుచూసిం ది. నగరం నుంచి ఐడీఎస్ కింద రూ.9,800 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ఓ వ్యక్తి చేసిన సంచలన ప్రకటన కూడా బోగస్ అని తేలింది. ఇంతకాలం ఆ వ్యక్తి ఎవరన్న అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు జరిగాయి.



అయితే సదరు వ్యక్తి ఐడీఎస్ కింద ప్రభుత్వానికి కట్టాల్సిన తొలి వాయిదాను చెల్లించకపోవడంతో ఆదాయ పన్నుశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఫిల్మ్‌నగర్‌లోని ఆ వ్యక్తి ఇంటిపై మంగళవారం సాయంత్రం ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడి చేశారు. ఏడు గంటలపాటు సోదాలు జరిపి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి పేరు బాణాపురం లక్ష్మణ్‌రావు అని ఐటీ దాడులతో వెల్లడైంది. అతనికి చార్టెడ్ అకౌంటెంట్‌గా ఉన్న  లక్ష్మినారాయణ ఇంటిపై సైతం ఐటీ దాడులు జరిగారుు. ఐడీఎస్ కింద లక్ష్మినారాయణ సైతం రూ.200 కోట్ల ఆస్తులను వెల్లడించారు.

 

ఏడు కంపెనీలు ఉన్నట్టు గుర్తింపు..

విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. లక్ష్మణ్‌రావు ఐడీఎస్ కింద ప్రకటించిన ఆస్తుల్లో నిబంధనల మేరకు 45 శాతాన్ని పలు వాయిదాల్లో ఆదాయ పన్నుశాఖకు చెల్లించాల్సి ఉంది. అయితే తొలి వాయిదా చెల్లించకుండా చేతులెత్తేయడంతో ఐటీ శాఖ ఆయనపై విచారణ చేపట్టింది. లక్ష్మణరావు వద్ద నిజంగానే రూ.9,800 కోట్ల ఆస్తులున్నాయా? ఆ మేరకు ఆస్తులు లేకున్నా ఉన్నట్లు వెల్లడించారా? లేక ఇతరులకు బీనామీగా ఈ ఆస్తులను ప్రకటిచారా? అన్న అంశాలపై ఐటీ శాఖ లోతుగా దర్యాప్తు చేస్తోంది. 


లక్ష్మణ్‌రావు ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు వెళుతున్న ఐటీ అధికారులు 

 

లక్ష్మణ్‌రావు సమీప బంధువు రమాదేవి పేరిట ఫిల్మ్‌నగర్‌లోని చిరునామాతో ఏడు కంపెనీలు రిజిస్టరైనట్టు గుర్తించినట్లు సమాచారం. ఇందులో లక్ష్మణ్‌రావుతో పాటు ఆయన భార్య, కొడుకులు ప్రమోద్, వెంకటేశ్, సంతోష్‌లు డెరైక్టర్లుగా ఉన్నారని సమాచారం. రూ.లక్ష క్యాపిటల్‌తో ఈ కంపెనీలను రిజిస్టర్ చేసినట్లు వెల్లడైంది. ఈ కంపెనీల్లో అధిక శాతం 2014 జూలైలోనే రిజిస్టరయ్యాయి. ఓ ప్రముఖ వ్యక్తికి బినామీగా లక్ష్మణ్‌రావు ఐడీఎస్ కింద రూ.9,800 కోట్ల ఆస్తులు ప్రకటించినట్లు చర్చ జరుగుతోంది.

 

ఇవే ఆ కంపెనీలు 

2014 జూలై 21న బీఎల్‌ఆర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, అదే నెల 9న బీఎల్‌ఆర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, బీఎల్‌ఆర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, 3న బీఎల్‌ఆర్ పవర్ ప్రాజెక్ట్, 11న బీఎల్‌ఆర్ ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్, 2013 జనవరి 9న బీఎల్‌ఆర్ పవర్ ప్రాజెక్ట్స్, 2008 మే 13న బీఎల్‌ఆర్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టరై ఉన్నాయి. లక్ష్మణ్‌రావు వ్యాపార, పారిశ్రామిక రంగాలతోపాటు భవన నిర్మాణ రంగంలోనూ  ఉన్నట్లు ఈ పత్రాల ద్వారా స్పష్టమవుతున్నది. ఈ సోదాల విషయంలో ఆదాయ పన్ను శాఖ ఇంకా అధికారికంగా స్పందించలేదు. 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top