స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) శాలరీ అకౌంట్ ఖాతాలను పెంచుకోవడానికి ‘ఎస్‌బీహెచ్ స్మార్ట్ శాలరీ’ (ఎస్‌ఎస్‌ఎస్) పేరిట ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టింది.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) శాలరీ అకౌంట్ ఖాతాలను పెంచుకోవడానికి ‘ఎస్‌బీహెచ్ స్మార్ట్ శాలరీ’ (ఎస్‌ఎస్‌ఎస్) పేరిట ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. నవంబర్ 15 నుంచి జనవరి 31 వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో ఖాతాలు తెరిచిన వారికి ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తున్నట్లు బ్యాంకు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఎస్‌ఎస్‌ఎస్ గోల్డ్, ఎస్‌ఎస్‌ఎస్ సిల్వర్ పేరుతో అందిస్తున్న ఈ రెండు ఖాతాలపై నెలకు 1.35 శాతం వడ్డీ చొప్పున ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీ, జీరో బ్యాలెన్స్ అకౌంట్, మల్టీ ఆప్షన్ డిపాజిట్, ఉచితంగా ఏటీఎం కార్డులు, మొబైల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నారు. ఈ ప్రచార సమయంలో ఖాతాలు తెరిచిన వారికి మొదటి సంవత్సరానికి రూ.రెండు లక్షల ఉచిత బీమాను, వ్యక్తిగత రుణాల ప్రోసెసింగ్ ఫీజులో పావు శాతం తగ్గింపును బ్యాంకు అందిస్తోంది.
ఎస్‌బీహెచ్ లిటిల్ ఇండియన్: నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా ‘లిటిల్ ఇండియన్’ పేరుతో ఎస్‌బీహెచ్ కొత్త డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద కనీ సం 12 నెలల నుంచి గరిష్టంగా 120 నెలలకు పిల్లల పేరు మీద డిపాజిట్ చేయెచ్చు. కనీస డిపాజిట్ మొత్తం రూ.1,000గాను, గరిష్ట డిపాజిట్ మొత్తం రూ.కోటిగా నిర్ణయించారు. ఏడు రోజుల తర్వాత డిపాజిట్ మొత్తాన్ని వెనక్కి తీసుకున్నా ఎటువంటి పెనాల్టీ లేకపోవడం దీనిలోని ప్రత్యేకత. వచ్చే జనవరి 14 వరకు మాత్రమే అమలులో ఉండే ఈ డిపాజిట్ పథకంపై 9.14 శాతం వార్షిక వడ్డీని బ్యాంకు ఆఫర్ చేస్తోంది.