నోట్ల రద్దు: నక్సలైట్లకు షాక్‌..! | Naxals force elderly to convert black money in Jharkhand | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దు: నక్సలైట్లకు షాక్‌..!

Nov 16 2016 2:25 PM | Updated on Sep 22 2018 7:51 PM

నోట్ల రద్దు: నక్సలైట్లకు షాక్‌..! - Sakshi

నోట్ల రద్దు: నక్సలైట్లకు షాక్‌..!

రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో నక్సలైట్‌ గ్రూపులు ఒక్కసారిగా షాక్‌ కు గురయ్యాయట!

లతెహార్‌: కేంద్ర ప్రభుత్వం సంచలన రీతిలో రూ.500, రూ.1000 నోట్లను ఆకస్మికంగా రద్దుచేయడంతో మావోయిస్టులతోపాటు ఇతర నక్సలైట్‌ గ్రూపులు ఒక్కసారిగా షాక్‌ కు గురయ్యాయని, పాత నోట్లను మార్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారని జార్ఖండ్‌ పోలీసులు తెలిపారు. వివిధ రూపాల్లో వసూళ్ల ద్వారా సేకరించిన డబ్బును.. ఆదివాసీ గిరిజనుల సహాయంతో మార్చుకునేందుకు నక్సలైట్లు ప్రయత్నిస్తున్నట్లు, ఈ క్రమంలో కొందరు చట్టానికి చిక్కినట్లు లతెహార్‌(జార్ఖండ్‌) ఎస్పీ అనూప్‌ బిర్తరే బుధవారం మీడియాకు వెల్లడించారు.

జార్ఖండ్‌ లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన లతెహార్‌, చుట్టుపక్కల జిల్లాల్లో నక్సలైట్ల నోట్ల మార్పిడిపై నిఘా పెంచామని ఎస్పీ పేర్కొన్నారు. బ్యాంకులో జమచేసే మొత్తంపై ఆంక్షలున్న నేపథ్యంలో గిరిజనుల ద్వారా నక్సలైట్లు నగదును మార్చుకుంటున్నారని తెలిసింది. కనీసం నోటు విలువను కూడా చెప్పలేని ఓ గిరిజన మహిళ రెండు రోజుల కిందట లతేహార్‌ లోని ప్రభుత్వ బ్యాంకుకు వచ్చి.. తన జనధన్‌ ఖాతాలో రూ.4.5 లక్షలు జమ చేసేందుకు ప్రయత్నించిందని, అయితే బ్యాంక్‌ అధికారులు పాన్‌ కార్డు అడగటంతో కంగారుపడిన ఆమె.. డిపాజిట్‌ చేయకుండానే వెనుదిరిగి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. మావోయిస్టు అనుబంధంగా అసోంలో పనిచేస్తున్న నక్సలైట్‌ గ్రూపు కూడా నోట్ల మార్పిడికి విఫల యత్నం చేసిందని, ఈ క్రమంలో భారీ నగదు కలిగిఉన్న ఇద్దరిని అరెస్ట్‌ చేశారని పోలీసులు పేర్కొన్నారు.

నక్సలైట్లు పలువురిని బెదిరించి, బలవంతపు వసూళ్ల ద్వారా డబ్బు సేకరిస్తారు కనుక అలాంటి సొమ్మును మార్పిడి చేసేందుకు సహకరించేవారు కూడా నేరస్తులే అవుతారని, ఎట్టిపరిస్థితుల్లోనూ అలాంటివారిని వదిలిపెట్టబోమని పోలీసులు అంటున్నారు. నోట్ల కష్టాల నుంచి గట్టెకేందుకు నక్సలైట్లు గిరిజనులనే కాక కమిషన్‌ ఏజెంట్లను సైతం సంప్రదిస్తున్నట్లు సమాచారం. 20 లేదా 30 శాతం కమిషన్‌ తీసుకుని నక్సలైట్ల దగ్గరున్న పాత నోట్లు మార్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు తమకు ఆధారాలు లభించాయని, దీంతో జిల్లా వ్యప్తంగా తనిఖీలు ముమ్మరం చేసినట్లు ఎస్పీ అనూప్‌ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement