
దేశవ్యాప్తంగా నిరసనలు
హడావుడిగా జీఎస్టీ అమలును నిరసిస్తూ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్తకులు, వ్యాపారులు శుక్రవారం ఆందోళనలు నిర్వహించారు.
కాన్పూర్/న్యూఢిల్లీ: హడావుడిగా జీఎస్టీ అమలును నిరసిస్తూ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్తకులు, వ్యాపారులు శుక్రవారం ఆందోళనలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని చాలా నగరాల్లో మార్కెట్లను మూసివేసి నిరసన తెలిపారు. కాన్పూర్, వారణాసి, అలహాబాద్, ఝాన్సీ, ఫైజాబాద్, షాజహాన్‌పూర్, ఘజియాబాద్‌ల్లో వర్తకులు ర్యాలీలు చేపట్టారు. కాన్పూర్‌లో అఖిల్ భారతీయ ఉద్యోగ్ వ్యాపార్ మండల్ ఆధ్వర్యంలో ప్యాసింజర్ రైలును అడ్డుకున్నారు. నగరంలోని ప్రముఖ హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లన్నీ మూతపడ్డా యి.
జీఎస్టీకి తాము వ్యతిరేకం కాదని, హడావుడిగా అమలు చేయడాన్నే వ్యతిరేకిస్తున్నామని ఉద్యోగ్ వ్యాపార్ మండలి ప్రతినిధులు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్, ఇండోర్, గ్వాలియర్, జబల్‌పూర్‌లో దుకాణాల్ని మూసేయడంతో వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. దేశ రాజధా ని ఢిల్లీలోని నయా బజార్ హోల్‌సేల్ మార్కెట్‌లో దుకాణాల్ని మూసివేసి వర్తకులు నిరసన తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో భారతీయ ఉద్యోగ వ్యాపార్ మండల్ బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. దేశంలోనే అతిపెద్దదైన కోల్‌కతాలోని బుర్రాబజార్ హోల్ సేల్ మార్కెట్ మూతపడింది. జీఎస్టీకి వ్యతిరేకంగా కశ్మీర్ వర్తకులు, తయారీదారుల ఫెడరేషన్ శనివారం సమ్మెకు పిలుపునిచ్చింది.