
రాజారత్నం అరెస్ట్
ముత్తూట్ ఫైనాన్స్‌లో బంగారం దోపిడీ కేసులో కీలక నిందితుడు సుందర్ రాజారత్నంను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ముత్తూట్ ఫైనాన్స్‌లో బంగారం దోపిడీ కేసులో కీలక నిందితుడు సుందర్ రాజారత్నంను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ధారవి ప్రాంతంలో పట్టుబడిన అతడిని సైబరాబాద్ పోలీసులు ఇక్కడికి తీసుకువచ్చారు. అతడి భార్య రాధను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
గతేడాది డిసెంబర్ 28న సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని బీరంగూడ కమాన్ సమీపంలో ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో మహారాష్ట్ర దోపిడీ ముఠా సినీ ఫక్కీలో దాదాపు 42 కిలోల బంగారాన్ని దోచుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికి 8 మందిని అరెస్ట్ చేసి 3.5 కిలోల బంగారాన్ని రికవరీ చేయగలిగారు. మిగతా బంగారం అంతా రాజారత్నం దగ్గరవున్నట్టు అనుమానిస్తున్నారు. అతడిని పోలీసులు విచారిస్తున్నారు. రోషన్ కాలా అలియాస్ లంబు, తుకారాం గైక్వాడ్‌లు పరారీలో ఉన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా మద్దూరు మండలం దొరెపల్లికి చెందిన రాజారత్నం కుటుంబం ముంబైలో స్థిరపడింది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీ చేయడానికి టికెట్ కోసం అతడు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.