మొబైల్ టారిఫ్‌లు పెరగవు.. | Sakshi
Sakshi News home page

మొబైల్ టారిఫ్‌లు పెరగవు..

Published Fri, Mar 27 2015 2:34 AM

mobile tarifs does not increase

కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్
న్యూఢిల్లీ: స్పెక్ట్రం కోసం టెలికం కంపెనీలు భారీగా వెచ్చించాల్సి రావడం వ ల్ల కాల్ చార్జీలు పెరుగుతాయన్న వాదనలను టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తోసిపుచ్చారు. దీని ప్రకారం ఆపరేటర్లపై వార్షికంగా రూ. 5,300 కోట్లు, నిమిషం పాటు ఉండే కాల్‌పై 1.3 పైసల మేర మాత్రమే భారం ఉంటుందని పేర్కొన్నారు. ఆపరేటర్ల వద్ద స్పెక్ట్రం 20 ఏళ్ల పాటు ఉంటుందన్నారు. వేలం పారదర్శకంగా జరిగిందని మంత్రి చెప్పారు. 19 రోజుల పాటు సాగిన స్పెక్ట్రం వేలంలో రికార్డు స్థాయిలో రూ. 1,09,874.91 కోట్ల బిడ్లు వచ్చిన సంగతి తెలిసిందే.

నిబంధనల ప్రకారం పది రోజుల్లోగా ప్రభుత్వానికి రూ. 28,872.7 కోట్ల చెల్లింపులు జరగాల్సివుంటుంది. అయితే, 2014-15 లోటు భర్తీ లక్ష్యాలను చేరుకునేందుకు మార్చి 31లోగా ఆరు రోజుల్లోనే ఆపరేటర్లు ఈ మొత్తం కట్టేయాలని కోరుతున్నట్లు మంత్రి చెప్పారు. తక్కువ స్పెక్ట్రం అందుబాటులో ఉంచి కృత్రిమ కొరత సృష్టిస్తోందంటూ వేలానికి ముందు టెలికం శాఖపై విమర్శలు వచ్చాయని ఆయన ప్రస్తావించారు. అయితే, 2100 మెగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్‌లో 85 మెగాహెట్జ్‌ను విక్రయానికి ఉంచగా 15 మెగాహెట్జ్ ఇంకా మిగిలిపోయిందని చెప్పారు. దీన్ని బట్టి తాము చేసినది సరైనదేనని తేలిందని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు.
 
వేలంలో ఐడియా సెల్యులార్ అత్యధికంగా రూ. 30,307 కోట్లు వెచ్చించి 900 మెగాహెట్జ్, 1800 మెగాహెట్జ్, 2100 మెగాహెట్జ్ బ్యాండ్‌లలో స్పెక్ట్రం దక్కించుకుంది. ఇవే బ్యాండ్‌విడ్త్‌లలో స్పెక్ట్రం కోసం ఎయిర్‌టెల్ రూ. 29,130 కోట్లకు బిడ్లు వేయగా, వొడాఫోన్ రూ. 29,960 కోట్లు వెచ్చిస్తోంది. కొత్తగా ప్రవేశిస్తున్న రిలయన్స్ జియో.. 800, 1800 మెగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్‌లో స్పెక్ట్రం కోసం రూ.10,077 కోట్ల మేర బిడ్లు వేయగా, ఆర్‌కామ్ రూ.4,299 కోట్లు వెచ్చిస్తోంది. వేలంలో పాల్గొన్నప్పటికీ టెలినార్ మాత్రం స్పెక్ట్రం దక్కించుకోలేదు. టాటా టెలీసర్వీసెస్ రూ. 7,851 కోట్లు, ఎయిర్‌సెల్ రూ. 2,250 కోట్ల బిడ్లు వేశాయి.
 
వేలం ఫలితాల వెల్లడిపై స్టే ఎత్తివేత..
స్పెక్ట్రం వేలం ఫలితాలను వెల్లడించడంపై విధించిన స్టేను సుప్రీంకోర్టు గురువారం ఎత్తివేసింది. ఇకపై చేపట్టాల్సిన ప్రక్రియ విషయంలో ముందుకెళ్లేందుకు ప్రభుత్వానికి అనుమతినిచ్చిన సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 26న ఇచ్చిన ఉత్తర్వులను సవరిస్తున్నట్లు తెలిపింది. తదుపరి విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది. సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులతో.. బిడ్డర్ల నుంచి ముందస్తుగా రూ. 28,000 కోట్లు రాబట్టుకునేందుకు ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. వేలం నియమ, నిబంధనలను ప్రశ్నిస్తూ టెల్కోలు దాఖలు చేసిన పిటీషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement