భారత పార్లమెంటు చరిత్రలో 15వ లోక్‌సభ.. అత్యధికంగా ఆటంకాలు, ప్రతిష్టంభనలు చవిచూసిన సభగా రికార్డులకెక్కనుంది.
*15వ లోక్‌సభ రికార్డు
* చివరి రోజున ఉభయసభల్లోనూ స్నేహపూర్వక వాతావరణం
* ఒకరినొకరు ప్రశంసించుకున్న అధికార, ప్రతిపక్షాల నేతలు
* టీ-బిల్లు ఆమోదంతో కొత్త ఏకాభిప్రాయం వచ్చిందన్న ప్రధాని
* ఉభయసభలూ నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ: భారత పార్లమెంటు చరిత్రలో 15వ లోక్‌సభ.. అత్యధికంగా ఆటంకాలు, ప్రతిష్టంభనలు చవిచూసిన సభగా రికార్డులకెక్కనుంది. 2010 శీతాకాల సమావేశాలు 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై జేపీసీ వేయాలన్న ప్రతిపక్ష డిమాండ్‌తో ప్రతిష్టంభన నెలకొని పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. 2012 వర్షాకాల సమావేశాలు కూడా.. బొగ్గు కుంభకోణానికి బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ఉభయసభల్లోనూ అనూహ్య గందరగోళం తలెత్తింది. దీంతో ఆ సమావేశాలూ ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టకుండానే ముగిశాయి. ఇలా వివిధ కుంభకోణాల విషయంలో ప్రభుత్వంపై ప్రతిపక్షం ఎదురుదాడికి దిగుతూ సభలను అడ్డుకుంటుండగా.. దానిని తిప్పికొట్టటానికి కానీ, వారిని ఒప్పించటానికి కానీ ప్రభుత్వం వద్ద ఎలాంటి వ్యూహాలూ లేకుండాపోయాయి. ఇక తాజా ఓట్ ఆన్ అకౌంట్ సమావేశాల్లో అయితే.. తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు జరిగిన ప్రయత్నాల్లో భాగంగా ఏకంగా 16 మంది సీమాంధ్ర సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు.
ఈ నెల 18న తెలంగాణ బిల్లుపై చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్‌కే చెందిన సీమాంధ్ర సభ్యుడు లగడపాటి రాజగోపాల్ నిండు సభలో పెప్పర్ స్ప్రే వెదజల్లటం.. దేశం యావత్తునూ దిగ్భ్రాంతికి గురిచేసింది. అయినప్పటికీ.. చరిత్రాత్మకమైనదే కాకుండా.. అత్యంత వివాదాస్పదమైన తెలంగాణ బిల్లును అధికార, ప్రతిపక్షాలు ఒక అవగాహనకు వచ్చి ఉభయసభల్లోనూ ఆమోదించటం ద్వారా.. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణను ఏర్పాటు చేశాయి. ఇదే సమావేశాల్లో.. సీమాంధ్ర, తెలంగాణ సభ్యు ల ఆందోళనల మధ్య యూపీఏ సర్కారు మధ్యంతర రైల్వే బడ్జెట్‌ను, ఓట్ ఆన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టి.. ఎలాంటి చర్చా లేకుండానే సభలో ఆమోదం పొందాయి. పార్లమెంటు సమావేశాల చివరి రోజున రాజ్యసభలో కూడా స్వల్ప చర్చ అనంతరం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించారు. శుక్రవారం నాడు ఉభయసభలనూ సభాపతులు నిరవధికంగా వాయిదావేశారు.
ఇక ఆర్డినెన్సులుగా ఆ ఆరు చట్టాలు?
పార్లమెంటు సమావేశాలను పొడిగించటానికి ప్రతిపక్ష పార్టీలు అంగీకరించకపోవటంతో.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పట్టుపడుతున్న ఆరు అవినీతి వ్యతిరేక బిల్లులను ఆర్డినెన్స్ రూపంలో అమలులోకి తీసుకువచ్చే అవకాశాలను చర్చిస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయంలో రాష్ట్రపతి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ శుక్రవారం మీడియాతో పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాలను పొడిగించేందుకు అంగీకరించాలని ప్రతిపక్ష పార్టీలను తాను గట్టిగా కోరినప్పటికీ అవి అంగీకరించలేదని రాహుల్‌గాంధీ చెప్పారు.
సభ్యులు ఆత్మవిమర్శ చేసుకోవాలి: అన్సారీ
సభకు ఆటంకం కలిగించడంలో.. ప్రశ్నోత్తరాల సమ యం ఆవశ్యకత విషయంలో సభ్యులు ఆత్మవిమర్శ చేసుకోవాలని రాజ్యసభ చైర్మన్ హమీద్అన్సారీ హితవుపలికారు. మొత్తం శీతాకాల సమావేశాల్లో రెండు స్వల్ప వ్యవధి ప్రశ్నలు మినహా.. గుర్తించిన ప్రశ్నలు వేటికీ మౌఖికంగా సమాధానం చెప్పలేదన్నారు.
సోనియాను కలవలేకపోయిన కాంగ్రెస్ ఎంపీలు
15వ లోక్‌సభ చివరి సమావేశాల్లో కాంగ్రెస్ సభ్యులు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలవలేకపోయా రు. గతంలో నిర్వహించిన విధంగా.. ఈసారి సమావేశాల చివరి రోజున పార్లమెంటులో కాంగ్రెస్ సర్వసభ్య సమావేశాన్ని కూడా నిర్వహించలేదు. పార్లమెంటు శీతాకాల సమావేశాల రెండో విడత భేటీల్లో 13 సార్లు సమావేశాలు జరిగినప్పటికీ.. పార్టీ సభ్యులు అధినేత్రిని కానీ, ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ను కానీ కలిసే అవకాశం లభించలేదు.
ఆ ఏడు రాష్ట్రాలకూ ప్రత్యేక హోదా ఇవ్వాలి...
మరో రెండు నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనుండగా.. బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించాలంటూ పార్లమెంటు సమావేశాల చివరి రోజున ఉభయసభల్లో డిమాండ్లు వెల్లువెత్తాయి. రఘురామ్రంజన్ కమిటీ సిఫారసుల మేరకు బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ ప్రతిపక్ష బీజేపీతో పాటు.. ఆ పార్టీ పాత మిత్రుడు జేడీ(యూ) కూడా లోక్‌సభలో డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో సీమాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించిన తరహాలోనే.. రఘురామ్రంజన్ కమిటీ గుర్తించిన ఏడు రాష్ట్రాలకు కూడా ప్రధాని ప్రత్యేక హోదా ప్రకటించాలని రాజ్యసభలోనూ ఎస్పీ, బీజేపీ, బీఎస్పీ, సీపీఎం, తృణమూల్కాంగ్రెస్, అన్నా డీఎంకే తదితర పార్టీలు డిమాండ్ చేశాయి.
బీహార్ బంద్‌కు సీఎం నితీశ్ పిలుపు
పాట్నా: సీమాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించిన కేం ద్రం.. బీహార్‌కు అదే హోదా ఇవ్వాలని రఘురామ్రంజన్ కమిటీ సిఫారసు చేసినప్పటికీ విస్మరించారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ధ్వజమెత్తారు. దీనికి నిరసనగా మార్చి 2న బీహార్ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. మరోవైపు.. బీహార్ బీజేపీ ఈ నెల 28న రాష్ట్రంలో రైల్ రోకోకు పిలుపునిచ్చింది.
క్లిష్ట నిర్ణయాలు తీసుకోగలమని టీ-బిల్లు చాటింది: ప్రధాని
పార్లమెంటులో తెలంగాణ బిల్లును ఆమోదించటం.. దేశం క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోగలదని చాటిచెప్పిందని ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ పేర్కొన్నారు. ఈ బిల్లు విషయంలో వ్యక్తమైన ఏకాభిప్రాయమనే కొత్త ఆలోచన.. దేశాన్ని కొత్త దారుల్లోకి తీసుకెళుతుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. ‘ఈ ఘర్షణాత్మక, ఉద్రిక్త వాతావరణం నుంచి ఆశావహమైన కొత్త వాతావరణం జన్మిస్తుంది’ అని పేర్కొన్నారు.
15వ లోక్‌సభ ముగింపు సందర్భంగా చివరి రోజైన శుక్రవారం నాడు ఆయన సభను ఉద్దేశించి చివరిసారిగా ప్రసంగించారు. సమావేశాలు ఆద్యంతం గందరగోళం, విమర్శలు, ప్రతివిమర్శలతో నడిచిన లోక్‌సభ.. చివరి రోజున మాత్రం సుహృద్భావ వాతావరణంలో ముగిసింది. గత పదేళ్లుగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్న మన్మో హన్.. రాబోయే ఎన్నికల్లో తమ ప్రభుత్వ పనితీరు, బలహీనతలు, విజయాలపై తీర్పు చెప్పేందుకు ప్రజలకు అవకాశం లభిస్తుందని వ్యాఖ్యానించారు.


