గణేశ్ ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం రాత్రంతా లోకల్ రైళ్లు నడపాలని సార్వజనిక గణేశ్ ఉత్సవ్ సమన్వయ సమితి అధ్యక్షుడు
సాక్షి, ముంబై: గణేశ్ ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం రాత్రంతా లోకల్ రైళ్లు నడపాలని సార్వజనిక గణేశ్ ఉత్సవ్ సమన్వయ సమితి అధ్యక్షుడు గణేశ్ చవాన్ సెంట్రల్ రైల్వే పరిపాలన విభాగంతో డిమాండ్ చేశారు. ఉత్సవాల సమయంలో నగర, తూర్పు, పశ్చిమ శివారు ప్రాంత ప్రజలతోపాటు ముంబైకి ఆనుకుని ఉన్న ఠాణే, రాయ్‌గడ్ జిల్లాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. అనేక చోట్ల కళ్లు మిరుమిట్లుగొలిపే విద్యుత్ దీపాలు, ఆకట్టుకునే భారీ విగ్రహాలు, అలంకరణలు తిలకించేందుకు నగర శివారు ప్రాంతాల నుంచి జనం వస్తుంటారు.
ముఖ్యంగా కరీరోడ్ ప్రాంతంలో ఉన్న ‘లాల్‌బాగ్ చా రాజా’, కింగ్స్ సర్కిల్ ప్రాంతంలో ఉన్న జీఎస్‌బీ ప్రతిష్ఠించిన విగ్రహాలను భక్తిప్రపత్తులతో కొలుస్తారు. వీటితోపాటు అనేక సార్వజనిక గణేశ్ ఉత్సవ్ మండళ్లు ఉన్నాయి. సాయంత్రం ఇంటి నుంచి బయటపడిన జనం విగ్రహాలను దర్శించుకుని అర్ధరాత్రి దాటిన తరువాత తిరుగు ప్రయాణమౌతారు. ఉత్సవాల సమయంలో నగర రోడ్లన్ని జన సంచారంతో కిక్కిరిసి ఉంటాయి. కాని ఇళ్లకు చేరుకునేందుకు తగిన రవాణా సదుపాయాలు లేకపోవడంతో తెల్లవారే వరకు కాలక్షేపం చేయాల్సివస్తుంది. సెంట్రల్ రైల్వే మార్గంలో అర్థరాత్రి 12.38 గంటలకు చివరి కర్జత్ లోకల్ రైలు ఉంటుంది.
ఈ రైలు అందని పక్షంలో తెల్లవారు జాము నాలుగు గంటల వరకు ప్లాట్‌ఫారాలపైనే భక్తులు పడిగాపులు కాయాల్సి వస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడతారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అర్ధరాత్రి దాటిన తరువాత ప్రతీ అర గంటకు ఒక ప్రత్యేక లోకల్ రైలును నడపాలని చవాన్ కోరారు. బెస్ట్ సంస్థ కూడా భక్తుల సౌకర్యార్థం రాత్రిళ్లు కొన్ని కీలమైన రూట్లలో ప్రత్యేక బస్సులు నడుపుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పశ్చిమ, సెంట్రల్, హార్బర్ రైల్వే మార్గంలో ప్రత్యేక లోకల్ రైళ్లు నడపాలని ఆయన రైల్వే శాఖతో విజ్ఞప్తి చేశారు.