సవాలక్ష లోపాలతో కూడిన 119 ఏళ్ల నాటి భూసేకరణ చట్టాన్ని చెత్తబుట్టలోకి విసిరేయడానికి రంగం సిద్ధమైంది.
న్యూఢిల్లీ: సవాలక్ష లోపాలతో కూడిన 119 ఏళ్ల నాటి భూసేకరణ చట్టాన్ని చెత్తబుట్టలోకి విసిరేయడానికి రంగం సిద్ధమైంది. దాదాపు రెండేళ్ల కసరత్తు అనంతరం తుదిరూపు దిద్దుకున్న సమగ్ర భూసేకరణ బిల్లు గురువారం లోక్‌సభ ముందుకు రానుంది. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ఆహార భద్రత బిల్లు తర్వాత అంతే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో ముఖ్యమైన బిల్లు ఇది. పారిశ్రామిక అవసరాల కోసం భూమిని సేకరించే సందర్భాల్లో నిర్వాసిత కుటుంబాలకు న్యాయమైన, సముచితమైన రీతిలో పరిహారం చెల్లించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. గ్రామీణ ప్రాంత నిర్వాసితులకు భూమి మార్కెట్ విలువపై నాలుగు రెట్లు, పట్టణ ప్రాంత నిర్వాసితులకు రెండు రెట్లు నగదు పరిహారం చెల్లించాలని ఈ బిల్లు నిర్దేశిస్తోంది. నిర్వాసితులను అభివృద్ధిలో భాగస్వాముల్ని చేసే ఈ బిల్లును కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరామ్ రమేశ్ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.
భూసేకరణ బిల్లును తొలుత రెండేళ్ల క్రితం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. రెండు సార్లు అఖిలపక్ష సమావేశాలు జరిపి విస్తృతంగా చర్చించారు. అనంతరం ‘భూసేకరణ, పునరావాసంలో సముచిత పరిహారం, పారదర్శకతల హక్కు బిల్లు-2012’గా పేరు మార్చారు. కాగా, ఆహార బిల్లు వచ్చే వారం ప్రారంభంలోనే చట్టంగా మారనుంది. ఈ బిల్లు సోమవారం రాజ్యసభలో చర్చకు రానుంది. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లుకు ఎగువ సభ కూడా పచ్చజెండా ఊపే అవకాశముంది.