అగ్నిపర్వతం బిలంలోనే ఆ గ్రామం | Japanese village inside the crater of a volcano | Sakshi
Sakshi News home page

అగ్నిపర్వతం బిలంలోనే ఆ గ్రామం

Apr 28 2015 5:57 PM | Updated on Mar 28 2019 5:12 PM

అగ్నిపర్వతం బిలంలోనే ఆ గ్రామం - Sakshi

అగ్నిపర్వతం బిలంలోనే ఆ గ్రామం

అంతర్గతంగా కుతకుత ఉడుకుతున్న ఓ ఉష్టమండల అగ్ని పర్వతం బద్దలైతే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెల్సిందే.

టోక్యో: అంతర్గతంగా కుతకుత ఉడుకుతున్న ఓ ఉష్టమండల అగ్ని పర్వతం బద్దలైతే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెల్సిందే. అలాంటి ఓ అగ్నిపర్వతం బిలంలోనే ఓ కుగ్రామం ఉందంటే, అందులో 205 మంది ధైర్యంగా నివసిస్తున్నారంటే ఆశ్చర్యమే. ఆ అగ్ని పర్వతం, ఆ కుగ్రామం....జపాన్ రాజధాని టోక్యో నగరానికి 358 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఐజూ దీవుల సముదాయంలో భాగంగావున్న ఆ గ్రామం పేరు అగాషిమ.

టోక్యో నగరం పాలనా యంత్రాంగం కిందనే అగాషిమ కొనసాగుతోంది. ఈ గ్రామంవున్న అగ్ని పర్వతాన్ని మూడో కేటగిరి కింద విభజించారు. ఇది ఎప్పుడైనా బద్దలయ్యే అవకాశం ఉంటుంది. 1780లో మొదటి సారి ఈ అగ్ని పర్వతం బద్దలైనప్పుడు గ్రామ ప్రజల్లో సగం మంది చనిపోయారు. మిగిలిన వారు సమీపంలోని దీవులకు వలసపోయారు. ఆ తర్వాత యాభై ఏళ్లకు వారిలో కొంత మంది తిరిగొచ్చి స్థిర నివాసం ఏర్పరుచుకున్నారని చరిత్ర చెబుతోంది. గ్రామస్థులు వేడినీళ్ల స్నానం చేయడానికి, వంట చేసుకోవడానికి వంట చెరకును వాడాల్సిన అవసరం లేదు. వేడి నీటి చెలిమల్లోనే వారు స్నానం చేస్తారు. మరీ తుక తుక ఉడుకుతున్నట్టు బుసబుస పొంగే చిన్న చిన్న నీటి గుంటలపై ఎలాంటి ఖర్చు లేకుండా వంట చేసుకుంటారు. ఉడకబెట్టిన గుడ్లు, బంగాళ దుంపలు, ఇతర కూరగాయలు వారి ప్రధాన ఆహారం. 

ప్రపంచానికి సంబంధం లేనట్టు ఉండే ఈ గ్రామానికి 1993 వరకు ఎలాంటి రవాణా సౌకర్యాలు లేవు. నౌకలను లంగరు వేసే అవకాశాలు కూడా లేకపోవడంతో టోక్యో నగరం 1993లో రోజుకు ఒక హెలికాప్టర్ సర్వీసును ఏర్పాటు చేసింది. ఆ హెలికాప్టర్‌లో కేవలం తొమ్మిది మంది ప్రయాణిలను తీసుకెళతారు. పేరుకు రోజువారి సర్వీసేగానీ ఆ హెలికాప్టర్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వెళుతుందో ఎవరూ చెప్పలేరు. వాతావరణ పరిస్థితులు సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ సర్వీసు నడుస్తుంది. అగ్నిపర్వతం నుంచి వెలువడే దట్టమైన పొగ, గ్యాస్ కారణంగా అక్కడ హెలికాప్టర్ దిగే పరిస్థితులు అన్ని వేళలా ఉండవు.

టోక్యో పాలనా యంత్రాంగం హెలికాప్టర్ సర్వీసును ప్రారంభించిన తర్వాత వారికి భూగర్భం నుంచి వెలువడే జియోథర్మల్ స్ట్రీమ్‌ను ఉపయోగించి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసింది. అక్కడి వారి పిల్లల కోసం ఒక ప్రాథమిక పాఠశాలను కూడా నడుపుతోంది. అందులో ప్రస్తుతం 25 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. హై స్కూల్‌కు వెళ్లాలంటే వారు టోక్యో నగరానికి వెళ్లాల్సిందే. అలా చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థుల్లో 99 శాతం మంది టోక్యో నగరంలోనే స్థిరపడుతున్నారట. వెనక్కి రావడం లేదట. అందుకని భారత్‌లో పెళ్లి కూతురును అత్తారింటికి పంపుతున్నట్టు విద్యార్థులను వారు ఘనంగా చదువు కోసం సాగనంపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement