స్విస్ బ్యాంకుల్లో.. తగ్గిన భారతీయుల సొమ్ము | Indian money in Swiss banks reduced .. | Sakshi
Sakshi News home page

స్విస్ బ్యాంకుల్లో.. తగ్గిన భారతీయుల సొమ్ము

Jun 19 2015 1:57 AM | Updated on Sep 3 2017 3:57 AM

స్విస్ బ్యాంకుల్లో.. తగ్గిన భారతీయుల సొమ్ము

స్విస్ బ్యాంకుల్లో.. తగ్గిన భారతీయుల సొమ్ము

స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచిన డబ్బు గతేడాది దాదాపు 10 శాతం తగ్గింది. స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ అయిన

2014లో 10 శాతం డౌన్
రూ. 12,615 కోట్లకు తగ్గుదల
 
 జ్యూరిక్ : స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచిన డబ్బు గతేడాది దాదాపు 10 శాతం తగ్గింది.  స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ అయిన స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్‌ఎన్‌బీ) వెల్లడించిన గణాంకాల ప్రకారం 2014 ఆఖరు నాటికి ఈ మొత్తం 1.8 బిలియన్ స్విస్ ఫ్రాంకులుగా (సుమారు రూ. 12,615 కోట్లు) ఉంది. అంతక్రితం ఏడాది ఈ మొత్తం 2.03 బిలియన్ స్విస్ ఫ్రాంకులుగా ఉండేది. స్విస్ బ్యాంకుల్లో భారతీయ సంస్థలు, వ్యక్తులు దాచిన డబ్బు ఇంత తక్కువ స్థాయికి తగ్గిపోవడం ఇది రెండోసారి.

2012లో ఇది దాదాపు రూ. 8,530 కోట్లకు తగ్గింది. ఆ తర్వాత ఏడాది (2013లో) 40 శాతం పెరిగింది. నల్ల ధనాన్ని దాచుకున్న వారి పేర్లు వెల్లడించాలంటూ స్విస్ బ్యాంకులపై భారత్ సహా ప్రపంచ దేశాల ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ గణాంకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

 మరోవైపు, ఇతర దేశాల వారు స్విస్ బ్యాంకుల్లో దాచుకునే డబ్బు గణనీయంగా పెరిగింది. 2013లో రూ. 90 లక్షల కోట్లుగా ఉండగా.. 2014లో ఇది రూ. 103 లక్షల కోట్లకు చేరింది. అమెరికన్లు స్విస్ బ్యాంకుల్లో దాచిన సొమ్ము వరుసగా రెండో ఏడాది కూడా పెరిగి 244 బిలియన్ స్విస్ ఫ్రాంకుల స్థాయికి చేరింది. బ్రిటన్, జర్మనీ, ఇటలీ తదితర దేశాల వారి నిధులూ ఇదే కోవలో పెరిగాయి.  ఎస్‌ఎన్‌బీ అధికారికంగా వెల్లడించిన గణాంకాల్లో నల్లధనం వివరాల గురించి ప్రస్తావన లేదు.

 పెరిగిన లాభాలు.. తగ్గిన ఉద్యోగులు..
 2014లో స్విస్ బ్యాంకుల స్థూల లాభాలు 6.4 బిలియన్ స్విస్ ఫ్రాంకుల మేర పెరిగాయి. స్విట్జర్లాండ్‌లోని 275 బ్యాంకుల్లో 246 బ్యాంకులు లాభాలార్జించాయి. అసాధారణ ఆదాయం నమోదు కావడం, ఇతరత్రా వ్యయాలు తగ్గడం ఇందుకు దోహదపడ్డాయి. మరోవైపు, బ్యాంకుల్లో ఉద్యోగుల సంఖ్య 1,844 మేర తగ్గి, 1,25,289కి చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement