పవన్ కల్యాణ్ ఎజెండా ఏంటి?
సుదీర్ఘ విరామం తర్వాత జనసేన పేరుతో మరోసారి తెరమీదకు వచ్చిన సినీనటుడు పవన్ కల్యాణ్ తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించడంలోని ఆంతర్యమేంటి?
సుదీర్ఘ విరామం తర్వాత జనసేన పేరుతో మరోసారి తెరమీదకు వచ్చిన సినీనటుడు పవన్ కల్యాణ్ తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించడంలోని ఆంతర్యమేంటి? దీని వెనుక ఎజెండా ఏదైనా ఉందా? ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు సామాజిక మీడియాలో దీనిపై పెద్ద చర్చే సాగుతోంది. సాధారణ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించే విషయంలో గడిచిన రెండేళ్ల కాలంలో పవన్ పెద్దగా మాట్లాడలేదు. ఈ అంశంపై పలు సందర్భాల్లో మీడియా ప్రశ్నించినప్పుడు సమయం వచ్చినప్పుడు మాట్లాడుతానంటూ దాటవేసేవారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలన్న విషయంలో ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో తీవ్ర దుమారం చెలరేగి కొద్దిరోజుల పాటు పార్లమెంట్ స్తంభించిన సమయంలోనూ, ప్రత్యేక హోదా సాధ్యం కాదని పార్లమెంట్ వేదికగా బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన రోజున కూడా పవన్ కల్యాణ్ పెదవి విప్పలేదు. ఈ విషయంలో పవన్ స్పందించాలని రాజకీయంగా పలు విమర్శలు వచ్చినప్పటికీ ఆయన నోరుమెదపలేదు.
అలాంటి పవన్ కల్యాణ్ ఉన్న ఫళంగా తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించడం, ఆ సభలో ప్రత్యేక హోదాపై మాట్లాడటం అందరినీ విస్మయపరిచింది. ఇప్పుడు ఈ అంశంపై పెద్ద చర్చే సాగుతోంది. తిరుపతిలో సభ నిర్వహణపై పవన్ అభిమాన సంఘాలతో గత కొద్దిరోజులుగా సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. సాధారణంగా సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి అనుమతించే విషయంలో ముప్పుతిప్పలు పెట్టే పోలీసులు సైతం పవన్ కల్యాణ్ అర్జీ పెట్టుకున్న ఒక్కరోజులోనే అనుమతించడం విశేషం.
ప్రత్యేక హోదా ఇస్తారనే నమ్ముతున్నాననీ ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని గతంలో పలు సందర్భాల్లో మాట్లాడిన పవన్ ఆ తర్వాత కాలంలో ఇవ్వలేమని కేంద్రం తేల్చినప్పటికీ మాట్లాడలేదు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు ఏర్పడిన రెండేళ్ల కాలం దాటిపోయిన తర్వాత తిరుపతి వేదికగా పవన్ కల్యాణ్ గళం విప్పినప్పటికీ అదే వేదిక నుంచి ఆయన కులమతాల అంశాన్ని ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే అయినప్పటికీ కులాల ప్రస్తావన దాదాపుగా రాదు.
పవన్ కల్యాణ్ ఆ రకమైన ప్రస్తావన చేయడం వెనుక ఎజెండా వేరే ఉందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. దానికి తోడు ప్రత్యేక హోదా అంశంపై సెప్టెంబర్ 9 వ తేదీన కాకినాడలో సభ నిర్వహిస్తానని ప్రకటించడం వెనుక కూడా మతలబు ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాపు రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం నియమించిన కమిషన్ గడువు సెప్టెంబర్ 7 తో పూర్తవుతుంది. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమ బాట పట్టిన ముద్రగడ పద్మనాభం ఇప్పటికే పలు దఫాలు ప్రభుత్వానికి గుర్తుచేస్తూ ప్రభుత్వం మరిన్న సాకులు వెతక్కుండా అసలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 7 తర్వాత ప్రభుత్వం స్పందించని పక్షంలో తదుపరి కార్యాచరణను నిర్ణయించుకోవాలని ముద్రగడ భావిస్తున్నట్టు చెబుతున్నారు. సరిగ్గా ఆ సమయంలో సెప్టెంబర్ 9 న ప్రత్యేక హోదా అంశంపై మరో సభ నిర్వహించాలని పవన్ పిలుపునివ్వడం అందులోనూ కాకినాడను ఆయన వేదికగా ఎంచుకోవడం గమనిస్తే పవన్ ఆలోచనల వెనుక మరో కోణం దాగి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాపు రిజర్వేషన్లతో పాటు ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమరణ దీక్ష చేయడానికి సిద్ధపడితే తాను కూడా వారితో పాటు దీక్షలో కూర్చుంటామని ముద్రగడ ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖలో సవాలు చేశారు. ఆమరణ దీక్ష ప్రారంభించి కబురుపెడితే తాను వచ్చి పాల్గొంటామన్నారు. తమ దీక్షల విషయంలో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయించాలని మండిపడ్డారు. ప్రత్యేక హోదాతో పాటు మనలోని పట్టుదల, చిత్తశుద్ధి కూడా ప్రజలకు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆ లేఖలో రాశారు.
కాపు రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం చెప్పిన గడువు సమీపిస్తుండటం, ప్రత్యేక హోదా అంశంపై ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ రంగ ప్రవేశం చేయడం గమనార్హం. ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ పై ప్రతిపక్షాలు గడిచిన రెండేళ్ల కాలంగా అనేక ఉద్యమాలు, ఆందోళనలు, దీక్షలు నిర్వహించాయి. విపక్ష నేతలు, ఎంపీలు అనేక దఫాలుగా ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతితో పాటు అనేక మంది కేంద్ర మంత్రులను కలిసి విన్నవిస్తూనే ఉన్నారు. పార్లమెంట్ సమావేశాల్లోనూ అనేకసార్లు ఆ పార్టీల ఎంపీలు నిలదీస్తూనే ఉన్నారు. పవన్ కల్యాణ్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలూ పోరాటం చేయాలని తిరుపతి సభ వేదికగా పిలుపునివ్వడం, అది కూడా రెండేళ్ల తర్వాత ఆయన ఈ అంశంపై తెరపైకి రావడంలో మతలబు వేరే ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
అధికారం చేపట్టిన తర్వాత ఒకసారి ప్రధానమంత్రి మోదీని అభినందించడం తప్ప ఇప్పటివరకు ఆయనను కలవలేదని చెప్పిన పవన్ ఏపీ ప్రజలకు అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా కల్పన అంశంపై ఈ రెండేళ్ల కాలంలో ఎందుకు కలవలేకపోయారో సభలో వివరించలేదు. ఇప్పటికైనా కలిసి అడుగుతారా అన్న విషయం కూడా చెప్పలేదు. ఎన్నికలకు ముందు తిరుపతి సభలో ప్రత్యేక హోదా హామీ ఇచ్చామని ప్రస్తావిస్తూ... అందుకే ఇక్కడి నుంచే ఆ మాట గుర్తు చేస్తున్నానన్నారు. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు నినాదంతో బీజేపీ రాష్ట్ర శాఖ 1998లో కాకినాడలోనే రాష్ట్ర విభజన కోరుతూ తీర్మానం ఆమోదించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 9 న అదే కాకినాడలో సభ నిర్వహించాలని నిర్ణయించడంలో ఏదైనా రాజకీయ ఆంతర్యం దాగి ఉందా? లేక కాపు ఉద్యమ నేత ముద్రగడ ఆ ప్రాంతానికి చెందిన వాడైనందున కాకినాడను ఎంచుకున్నారా? అన్న విషయం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రత్యేక హోదా విషయంలో మరో మూడు రాష్ట్రాలు అడ్డుపడుతున్నాయన్న కేంద్ర మంత్రి, టీడీపీ నేత అశోక గజపతిరాజుపైన పవన్ విమర్శలు చేశారు. తుమ్మితే ఊడిపోయే పదవిలో కొనసాగుతారెందుకు... రాజీనామా చేయండని అశోక గజపతిరాజును అన్నారు. కానీ ఎక్కడా ఆయన చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయలేదు. కేంద్ర ప్రభుత్వంలో కొనసాగాలా వద్దా అన్న విషయం తేల్చాల్సింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆ విషయం పవన్ కల్యాణ్ కు బాగా తెలుసు. ప్రత్యేక హోదా అంశంపై పోరాటం చేయాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడుకు సవాలు విసరకుండా పవన్ కల్యాణ్ మంత్రి అశోక గజపతిరాజు పేరును మాత్రమే ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది.
గడిచిన రెండేళ్ల కాలంలో అనేక పార్టీలు, ప్రజా సంఘాలు ప్రత్యేక హోదా కోసం అనేక పోరాటాలు సాగిస్తున్నాయి. పార్లమెంట్ లో గళం విప్పుతున్నాయి. అవన్నీపక్కనపెట్టి అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయాలని పవన్ పిలుపునివ్వడం గమనార్హం. ఇకనుంచైనా ఆయన ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామంటున్నారనుకుంటే... తాను అటు సినిమాల్లో నటిస్తా... ఇటు రాజకీయం చేస్తా... అని ప్రకటించి ప్రత్యేక హోదా కోరే అభిమానులను మాత్రం నిరాశపరిచారన్న వాదన మాత్రం బలంగా వినిపిస్తోంది.


