పంచాయతీల్లోనే అన్ని సేవలు

పంచాయతీల్లోనే అన్ని సేవలు


సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాంకు నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమం కింద సమగ్ర సేవా కేంద్రా (వన్‌స్టాప్ షాప్)లను పంచాయతీ కార్యాలయాల్లోనే ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ-పంచాయత్ వ్యవస్థను కూడా సమగ్ర సేవా కేంద్రాల్లోనే విలీనం చేయనున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం కింద ఎంపిక చేసిన 150 మండలాల్లో ఈ ఏడాది వెయ్యి సమగ్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రెండేళ్లలో మిగిలిన గ్రామాలకూ విస్తరించనున్నారు. వన్‌స్టాప్ షాప్‌ల ఏర్పాటు బాధ్యతలను ప్రభుత్వం శ్రీనిధి బ్యాంకుకు అప్పగిస్తూ రూ. 64 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది.

 

అన్ని సేవలూ ఒకేచోట..

గ్రామీణ ప్రజలకు ఈ-పంచాయత్, మీసేవ, శ్రీనిధి కియోస్క్‌ల నుంచి ప్రస్తుతం లభిస్తున్న సేవలన్నింటినీ ఇకపై ఒకేచోట లభ్యమయ్యేలా సమగ్ర సేవా కేంద్రాలను ఆయా సంస్థలకు అనుసంధానం చేయనున్నారు. అంతేకాకుండా ఓఎస్‌ఎస్‌ల నుంచే ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన బ్యాంకు ఖాతాలను తెరుచుకునే సదుపాయం కల్పిస్తున్నారు. స్వయం సహాయక గ్రూపులకు పావలా వడ్డీ రుణాలు, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు, ఉపాధిహామీ కూలీలకు వేతన చెల్లింపులు, ఆసరా పెన్షనర్లకు పింఛను సొమ్ము..



తదితర చెల్లింపులన్నీ ఇక్కడ్నుంచే లభ్యమవుతాయి. అన్నిరకాల ధ్రువపత్రాల కోసం దరఖాస్తులను ఓఎస్‌ఎస్‌ల నుంచే సమర్పించవచ్చు. పొదుపు ఖాతాలు, నగదు జమ, డిపాజిట్లు, అన్ని రకాల చెల్లింపులు.. తదితర సేవలను సెప్టెంబర్ నుంచి ఓఎస్‌ఎస్‌ల నుంచే  గ్రామంలోని ప్రజలందరూ పొందవచ్చు.

 

నిర్వహణ బాధ్యత వీఎల్‌ఈలకే..

వన్‌స్టాప్ షాప్‌ల నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక గ్రూపుల నుంచి మహిళల (విలేజ్ లెవల్ ఎంటర్‌ప్రైనర్)ను ఎంపిక చేస్తారు. వీఎల్‌ఈ నియామకానికి ఇంటర్ విద్యార్హత కాగా, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. నియామక ప్రక్రియను పారదర్శకంగా చేసేందుకు అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top