ఆదాయ పన్ను ఎగవేతదారులకు కేంద్ర ప్రభుత్వం మరో చివరి అవకాశం కల్పించింది.
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను ఎగవేతదారులకు కేంద్ర ప్రభుత్వం మరో చివరి అవకాశం కల్పించింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం(పీఎంజీకేవై)లో భాగంగా ఆస్తుల వివరాలను ప్రకటించే గడువును మరోసారి పొడిగించింది. ప్రధాన్ మంత్రీ గరీబ్ కళ్యాణ యోజన (పిఎంజికెవై) కింద మే 10 వరకు పన్ను చెల్లింపులు, డిపాజిట్లపై నల్లధారుదారుల డిక్లరేషన్లు ప్రకటించాలని సీబీడీటీ శుక్రవారం తెలిపింది. మార్చి 31 లోపు సర్ఛార్జ్ మరియు పెనాల్టీ చెల్లించినవారు, ఏప్రిల్30 లోపు డిపాజిట్ పథకం కింద డిపాజిట్ చేసినవారికి ఈ డిక్లరేషన్‌కు అవకాశమని ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
మార్చి 31తోముగిసిన ఈ గడువును మే 10 వరకు పొడిగించింది. 2016 ప్రధాన్ మంత్రీ గరీబ్ కళ్యాణ్ డిపాజిట్ పథకం కింద ఆన్‌లైన్ లో తమ ఆదాయ వివరాలను ప్రకటించాలని చెప్పింది. స్కాన్ చేసిన కాపీలు అప్‌లోడ్ చేసిన తరువాత ఆన్‌లైన్ దాఖలు చేయవచ్చని తెలపింది. ఆదాయ వెల్లడికి మార్చి 31, 2017తో ముగిసిన గడువును పెంచుతూ నల్లకుబేరులకు మరో చాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 50 శాతం పన్ను, జరిమానాతో ఈ గడువు లోపు ఆదాయాలను వెల్లడించాలి. పీఎంజీకేవై పథకం కింద పన్ను చెల్లించే నల్లధనం కుబేరులు 49.9శాతం ఆదాయపన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 25 శాతం జీరో శాతం వడ్డీపై నాలుగు సంవత్సరాలు డిపాజిట్ చేయాలి. దీంతోపాటు గడువులోగా చెల్లించకపోతే 77.25శాతం జరిమానా చెల్లించాలి. ఆస్తుల వివరాలను వెల్లడించని వారికి భారీగా జరిమానా విధిస్తామని గతంలో స్వయంగా రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ ఆధియా హెచ్చరించారు. వివరాలను వెల్లడించిన వాళ్ల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని ప్రకటించిన సంగతి తెలిసందే.