
గ్యాంగ్ రేప్ బాధితురాలిపై మళ్లీ...
హరియాణాలో దారుణం జరిగింది. 21 ఏళ్ల యువతిపై మూడేళ్ల క్రితం సామూహిక అత్యాచారం చేసిన నిందితులు.. తాజాగా ఆమెపై మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
హరియాణాలో దారుణం జరిగింది. 21 ఏళ్ల యువతిపై మూడేళ్ల క్రితం సామూహిక అత్యాచారం చేసిన నిందితులు.. తాజాగా ఆమెపై మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. కోర్టు వెలుపలే పాత కేసును సెటిల్ చేసుకోవాలంటూ బెదిరించడానికే వాళ్లలా చేశారని అంటున్నారు. అయినా ఇంతవరకు ఈ కేసులో ఒక్కరిని కూడా పోలీసులు అరెస్టు చేయలేదు. మూడేళ్ల క్రితం భివానీలో ఐదుగురు వ్యక్తులు ఈ దళిత యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. వాళ‍్లు స్వేచ్ఛగా బయట తిరుగుతూ బాధితురాలి కుటుంబాన్ని బెదిరిస్తూ ఉన్నారు. వేరే ఊరు వెళ్లిపోవాలని హెచ్చరించారు. ప్రస్తుతం ఎండీ యూనివర్సిటీలో పీజీ చేస్తున్న ఆ యువతి నాలుగు రోజుల క్రితం యూనివర్సిటీ కాలేజికి వెళ్లి.. తిరిగి రాలేదు. తర్వాత ఆమె దుస్తులు చిరిగిపోయి.. దారుణమైన స్థితిలో సుఖ్పురా చౌక్ వద్ద స్పృహ లేకుండా కనిపించింది. ఆమెను స్థానికులు చూసి రోహ్తక్ సివిల్ ఆస్పత్రికి తరలించారు.
యువతి ఫిర్యాదు మేరకు అనిల్ అలియాస్ బిట్టు, రాజు అలియాస్ జగ్మోహన్, సందీప్ సింగ్, మౌసమ్ కుమార్, ఆకాష్ అనే నలుగురు యువకులపై కేసు నమోదైంది. నిందితులలో ముగ్గురు ఉన్నత కులాలకు చెందినవాళ్లు కాగా, ఇద్దరు దళితులు. ఇద్దరికి ఉద్యోగాలున్నాయి, ఇద్దరు స్వయం ఉపాధితో బతుకుతున్నారు. మరొక యువకుడు నిరుద్యోగి. 2013లో తాము కేసు పెడితే ఇద్దరిని అరెస్టు చేసినా, మళ్లీ వెంటనే వాళ్లు బెయిల్ మీద బయటకు వచ్చేశారని బాధితురాలి సోదరుడు చెప్పారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు తమ సోదరి మరోసారి సామూహిక అత్యాచారానికి గురైందని వాపోయాడు. కోర్టు బయట సెటిల్ చేసుకోవాలంటూ వాళ్లు తమపై ఒత్తిడి తెచ్చారని, తాము నిరాకరించడంతో ఇప్పుడిలా చేశారని చెప్పాడు.