హంగామా చేయట్లేదు

హంగామా చేయట్లేదు - Sakshi


* భారీ ఖర్చు ఆరోపణల్లో వాస్తవం లేదు

*  ‘రాజధాని శంకుస్థాపన’పై సీఎం చంద్రబాబు 

* శంకుస్థాపన ఏర్పాట్లకోసం 8 కమిటీల ఏర్పాటు

సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి హంగామా చేయాలని అనుకోవట్లేదని, ఎక్కువ మందిని భాగస్వాముల్ని చేయడం ద్వారా రాజధానిలో జరిగే తొలి శుభ కార్యక్రమానికి మరింత వన్నె తేవాలని భావిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.



ప్రధానమంత్రి మోదీ పాల్గొననున్న అమరావతి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహణకోసం రాష్ట్రప్రభుత్వం గురువారం ఎనిమిది కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లో సభ్యులుగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులను నియమించింది. ఈ కమిటీలతో గురువారం ఇక్కడి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. శంకుస్థాపన కార్యక్రమానికి భారీగా నిధులు వెచ్చిస్తున్నట్లు కొంతమంది చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.

 

ముందురోజే మట్టి, నీటిని వెదజల్లాలి..

ప్రధానమంత్రి గంటా 15 నిమిషాలు శంకుస్థాపన కార్యక్రమానికి కేటాయించారని, ఆ వ్యవధిలోనే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని 16వేల గ్రామాలు, పుణ్య నదులు, దేవాలయాలు, ప్రార్థనాస్థలాలు, ప్రముఖుల నివాస ప్రాంతాలనుంచి సేకరించిన పవిత్రమైన మట్టి, నీటిని విజయదశమి ముందురోజే సీఆర్‌డీఏ ప్రాంతంలో వెదజల్లాలని సూచించారు.



వైష్ణోదేవి, స్వర్ణ దేవాలయం, బుద్ధగయ, రామేశ్వరం, కాశీ, పూరి, శబరిమల, ఛార్‌ధామ్ వంటి దివ్య క్షేత్రాలు, అజ్మీర్, నాగపట్నం వేళంగిణి, జామా మసీదు, ముంబై, హైదరాబాద్ మక్కా మసీదు వంటి ప్రార్థనా స్థలాల నుంచి మట్టిని సేకరించే బాధ్యతను ఎంపీలు తీసుకోవాలని సీఎం కోరారు. భద్రాచలం, యాదగిరిగుట్ట, సమ్మక్కసారక్క, మెదక్ చర్చి, అలంపూర్, వేయిస్తంభాలగుడి, బాసర ఆలయాల నుంచి కూడా మట్టిని సేకరించాలన్నారు. ఇవికాక రాష్ట్రంలోని 150 దేవాలయాల నుంచి మట్టి తేవాలన్నారు. అంబేడ్కర్, భగత్‌సింగ్, మౌలానా, జగజ్జీవన్‌రామ్, పూలే, అబ్దుల్‌కలాం, మరాఠా యోధుడు శివాజీ, అల్లూరి సీతారామరాజు నివసించిన గ్రామాలనుంచి సైతం మట్టిని తేవాలన్నారు.

 

పత్రాలపై అభిప్రాయాలు రాయొచ్చు


సంకల్ప పత్రాలపై ప్రభుత్వం ఇచ్చిన నమూనాలోనే కాకుండా రాజధాని నిర్మాణం ఎలా జరగాలని కోరుకుంటున్నారో ప్రజలు తమ మనోభావాలు, అభీష్టాలను రాయవచ్చని ముఖ్యమంత్రి  చెప్పారు. గురువారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జన్మభూమి కమిటీ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ‘మననీరు-మనమట్టి-మన అమరావతి’ కార్యక్రమంపై మూడోరోజు సమీక్ష నిర్వహించారు. వీటన్నింటినీ ఒక క్యాప్సుల్‌లో భద్రతపరుస్తామన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top