ఫ్లై దుబాయ్ విమాన సర్వీసులు పెంపు | Expansion of air services of Fly Dubai | Sakshi
Sakshi News home page

ఫ్లై దుబాయ్ విమాన సర్వీసులు పెంపు

Apr 2 2015 2:32 AM | Updated on Sep 2 2017 11:42 PM

భారత్-దుబాయ్ మధ్య విమాన సేవలను విస్తృతం చేస్తున్నట్లు ఫ్లై దుబాయ్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ (కమర్షియల్ ఆపరేషన్స్) సుధీర్ శ్రీధరన్ వెల్లడించారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై : భారత్-దుబాయ్ మధ్య విమాన సేవలను విస్తృతం చేస్తున్నట్లు ఫ్లై దుబాయ్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ (కమర్షియల్ ఆపరేషన్స్) సుధీర్ శ్రీధరన్ వెల్లడించారు. దుబాయ్-చెన్నై మధ్య వారానికి మూడు విమాన సర్వీసులను బుధవారం చెన్నైలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దుబాయ్ కేంద్రంగా తమ సంస్థ 2010లో లక్నోకు సేవల ద్వారా భారత్‌లో అడుగుపెట్టిందని అన్నారు. ఢిల్లీ, కొచ్చీ, ముంబయి, తిరువనంతపురం నుంచి దుబాయ్‌కు ప్రయాణాలను అందుబాటులోకి తెచ్చామని అన్నారు.

ఈ ప్రాంతాల నుంచి ఒక్క ఏడాదిలోనే ప్రయాణికుల సంఖ్యలో 70 శాతం ప్రగతి సాధించామని చెప్పారు. ప్రస్తుతం చెన్నైలో ప్రారంభించుకున్న విమానసేవలతో కలుపుకుని దుబాయ్-భారత్ మధ్య సర్వీసుల సంఖ్య 29కి చేరుకుందని అన్నారు. అలాగే 46 దేశాల్లో 23 కొత్త రూట్ల ద్వారా 95 గమ్యాలకు సర్వీసులను నడపాలని గత ఏడాది నిర్ణయించినట్లు తెలిపారు. ఇక భారత దేశ పరిధిలో చెన్నై, అహ్మదాబాద్, ఢిల్లీ, హైదరాబాద్, కొచ్చీ, లక్నో, ముంబై, తిరువనంతపురం మధ్య సేవలందిస్తున్నట్లు చెప్పారు.

విమాన సర్వీసుల వేళలు, చార్జీలు

స్థానిక కాలమాన ప్రకారం ఎఫ్‌జెడ్447 విమానం (మంగళ, గురు, శనివారం) దుబాయ్ ఇంటర్నేషనల్ టెర్మినల్-2లో 22.05కు బయలుదేరి, చెన్నై ఎయిర్‌పోర్టుకు స్థానిక కాలమాన ప్రకారం 4గంటలకు చేరుకుంటుంది. అలాగే చెన్నై ఎయిర్‌పోర్టులో ఎఫ్‌జెడ్448 విమానం (బుధ, శుక్ర, ఆదివారం) 4.45గంటలకు బయలుదేరి 7.35 గంటలకు చేరుకుంటుంది. వారానికి మూడు సర్వీసులు. ఎకనమిక్ క్లాస్ రాను..పోనూ రూ.14వేలు, బిజినెస్ క్లాస్ రానుపోను రూ.29వేలుగా నిర్ణయించారు.

Advertisement
Advertisement