మరుగుదొడ్ల శుభ్రతకు స్కావెంజర్లను వినియోగిస్తే జైలే | Don't use Manual Scavengers to clean toilets | Sakshi
Sakshi News home page

మరుగుదొడ్ల శుభ్రతకు స్కావెంజర్లను వినియోగిస్తే జైలే

Nov 30 2013 1:45 AM | Updated on Aug 28 2018 5:25 PM

మరుగుదొడ్లను, సీవరేజీ లేన్లను శుభ్రం చేయడానికి ఇకపై పారిశుద్ధ్య కార్మికుల(మాన్యువల్ స్కావెంజర్స్)ను వినియోగించుకుంటే అలాంటివారు ఏకంగా జైలు శిక్షను, జరిమానాలను ఎదుర్కోవలసి ఉంటుంది.

సాక్షి, హైదరాబాద్: మరుగుదొడ్లను, సీవరేజీ లేన్లను శుభ్రం చేయడానికి ఇకపై పారిశుద్ధ్య కార్మికుల(మాన్యువల్ స్కావెంజర్స్)ను వినియోగించుకుంటే అలాంటివారు ఏకంగా జైలు శిక్షను, జరిమానాలను ఎదుర్కోవలసి ఉంటుంది. స్కావెంజర్ల వినియోగంపై నిషేధం, కార్మికుల పునరావాసంకోసం తయారైన చట్టం ప్రభుత్వానికి ఈ అధికారాలు కల్పిస్తోంది. పార్లమెంటు ఆమోదించిన ఈ చట్టం వచ్చే నెల 6నుంచి అమలుకానున్న నేపథ్యంలో  మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మాన్యువల్ స్కావెంజర్ల వివరాలను పురపాలక శాఖ సేకరించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. పారిశుద్ధ్య కార్మికులతో మరుగుదొడ్లను శుభ్రం చేయించే ఇళ్ల యజమానుల జాబితా సిద్ధం చేయాలని, వారికి నోటీసులు జారీ చేయాలని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లను ఆదేశిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ డెరైక్టర్  ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త చట్టంలోని ప్రధాన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
 
 ఈ చట్టం ప్రకారం చేసిన తప్పులు మళ్లీ చేస్తే మొదసారి ఆరునెలలు ఉండే జైలుశిక్ష వ్యవధి ఐదేళ్లకు పెరుగుతుందన్నారు. యాభై వేల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు జరిమానా విధించవచ్చన్న అంశాన్ని స్పష్టం చేయాలన్నారు. పట్టణాలు, నగరాల్లోని లక్షా 73 వేల ఇన్‌శానిటరీ మరుగుదొడ్లలో లక్షా 40 వేల మరుగుదొడ్ల నుంచి వ్యర్థాలు ఓపెన్ డ్రెయిన్లలోకి వదిలేస్తున్నారని ఇందుకు బాధ్యులైన వారందరికీ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. సెప్టిక్ ట్యాంక్‌లను శుభ్రంచేసే పనిని మనుషులతో కాకుండా యంత్రాలతో చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మాన్యువల్ స్కావెంజర్లకు పునరావాసం కల్పించే బాధ్యతను జిల్లా కలెక్టర్లు నిర్వర్తించాలని  పేర్కొన్నారు. సఫాయి కర్మచారి కమిషన్‌ను కూడా ఏర్పాటు చేయాలని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement