పై-లీన్ తుపాను గండం మరువకముందే మరో గండం వచ్చి పడింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో మూడు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం బుధవారం ఉదయం వాయుగుండంగా మారింది
సాక్షి, విశాఖపట్నం : పై-లీన్ తుపాను గండం మరువకముందే మరో గండం వచ్చి పడింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో మూడు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం బుధవారం ఉదయం వాయుగుండంగా మారింది. సాయంత్రానికి ఆగ్నేయ/నైరుతి బంగాళాఖాతం వద్ద కేంద్రీకృతమైంది. రానున్న 48 గంటల్లో అది మరింత బలపడి తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది.
బుధవారం సాయంత్రం 5.30 గంటలకు తూర్పు ఆగ్నేయ దిశగా నెల్లూరు ప్రాంతానికి 680 కి.మీ. దూరంలో, చెన్నైకు కూడా అదే దిశలో 600కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. అది క్రమంగా పశ్చిమ దిశగా దిశ మార్చుకుని పశ్చిమ వాయువ్య దిశగా మారి ఈనెల 16వ తేదీ నాటికి ఉత్తర తమిళనాడు తీరం వద్ద వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. తీరం దాటే సమయంలో భారీ వర్షాలతో పాటు బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందన్నారు.