సమ్మె చేస్తున్న రెసిడెంట్ వైద్యులపై ఢిల్లీ ప్రభుత్వం 'ఎస్మా' ప్రయోగించింది.
న్యూఢిల్లీ: సమ్మె చేస్తున్న రెసిడెంట్ వైద్యులపై ఢిల్లీ ప్రభుత్వం 'ఎస్మా' ప్రయోగించింది. ఈ ఉదయం 11 గంటలలోపు విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది. డాక్టర్లు తమ ఆదేశాలను బేఖతారు చేయడంతో కేజ్రీవాల్ సర్కారు ఎస్మా ప్రయోగించింది. దేశ రాజధానిలోని 20 ఆస్పత్రుల్లో పనిచేస్తున్న దాదాపు 2 వేల మంది డాక్టర్లు తమ డిమాండ్ల సాధన కోసం నిరవధిక ఆందోళనకు దిగారు.
అవసరమైన ఔషధాలు సరిపడా సరఫరా చేయాలని, ఆస్పత్రుల్లో తమకు రక్షణ కల్పించాలని, జీతాలు సకాలంలో ఇవ్వాలని వైద్యులు డిమాండ్ చేశారు. అయితే వైద్యుల 19 డిమాండ్లను తాము ప్రభుత్వం ఆమోదించిందని ఢిల్లీ వైద్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. కేంద్రం, ఎంసీడీ ఆమోదం కూడా కావాలని వైద్యులు పట్టుబడుతున్నారని వెల్లడించారు.