దాద్రి హత్య, బీఫ్ వివాదమై దేశమంతా అలజడి కొనసాగుతున్నప్పటికీ.. ఓ బీజేపీ ఎంపీ మాత్రం తేలిగ్గా కొట్టిపారేశారు.
న్యూఢిల్లీ: దాద్రి హత్య, బీఫ్ వివాదమై దేశమంతా అలజడి కొనసాగుతున్నప్పటికీ.. ఓ బీజేపీ ఎంపీ మాత్రం తేలిగ్గా కొట్టిపారేశారు. ఆవు మాంసం తిన్నారనే ఆరోపణలతో ఉత్తరప్రదేశ్లోని దాద్రిలో ఓ ముస్లిం వ్యక్తిని మూకుమ్మడిగా దాడిచేసి చంపేసిన ఘటన చాలా చిన్నదని బాఘ్పాట్ బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ పేర్కొన్నారు. 'దాద్రి లాంటి చిన్న ఘటనను మన ప్రజాస్వామిక వాతావరణం, మన దేశం హ్యాండిల్ చేయగలదు. దీనిపై బయటివాళ్లు మనకు ఉపన్యాసాలు ఇవ్వాల్సిన అవసరం లేదు' అని ఆయన మంగళవారం విలేకరులతో పేర్కొన్నారు.
ముంబై మాజీ పోలీసు కమిషనర్ అయిన సత్యపాల్ ప్రాతినిధ్యం వహిస్తున్న బాఘ్పాట్కు దాద్రి రెండు గంటల ప్రయాణ దూరం మాత్రమే. దాద్రి ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఘటనపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని బీజేపీ తన ఎంపీలను హెచ్చరించింది. అయినప్పటికీ ఆ పార్టీ ఎంపీలు, నేతల నుంచి అడపాదడపా వివాదాస్పద వ్యాఖ్యలు వస్తూనే ఉన్నాయి. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు సిగ్గుచేటు అని, తమ సొంతవారిపట్ల ఇలాంటి అమానుషం జరిగితే అప్పుడు కూడా ఆయన ఇలాగే స్పందిస్తారా? అని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ మండిపడ్డారు.