
షరీఫ్‌కు తాత్కాలిక ఊరట
పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు ఆ దేశ సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. పనామా పత్రాల కేసులో షరీఫ్‌ను పదవి నుంచి తొలగించేందుకు సరైన సాక్ష్యాధారాలు
ప్రధాని పదవి నుంచి తొలగించలేం: పాక్ సుప్రీంకోర్టు
అవినీతి ఆరోపణలపై దర్యాప్తునకు జిట్ ఏర్పాటు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు ఆ దేశ సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. పనామా పత్రాల కేసులో షరీఫ్‌ను పదవి నుంచి తొలగించేందుకు సరైన సాక్ష్యాధారాలు లేవంటూ న్యాయ స్థానం తీర్పు చెప్పింది. అయితే ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన అవినీతి ఆరోప ణలకు సంబంధించి దర్యాప్తు జరిపేందుకు సంయుక్త దర్యాప్తు బృందం (జిట్)ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 540 పేజీల తీర్పును గురువారం వెలువరించింది.
ఐఎస్‌ఐ, మిలిటరీ ఇంటెలిజెన్స్, ఎఫ్‌ఐఏ, ఎన్‌ఏబీ, సెక్యూరిటీ, ఎక్సే్ఛంజ్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ సహా కీలక సంస్థలకు చెందిన అధికారులతో జిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. షరీఫ్‌తో పాటు ఆయన ఇద్దరు కుమారులు హసన్, హుస్సేన్ జిట్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో పూర్తి స్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉందని జస్టిస్ ఖోసా పేర్కొన్నారు.
వారం రోజుల్లో జిట్‌ను ఏర్పాటు చేయాలని, రెండు వారాలకోసారి జిట్ తన నివేదికను ధర్మాసనానికి సమర్పించాలని, 60 రోజుల్లో దర్యాప్తును పూర్తి చేయాలని ఆదేశించారు. జిట్ నివేదిక ఆధారంగా ప్రధానిని అనర్హునిగా ప్రకటించా లనే పిటిషన్‌ను తిరిగి విచారణకు స్వీకరించే అవకాశం ఉందని కోర్టు స్పష్టం చేసింది. షరీఫ్ లండన్‌లో అక్రమంగా ఆస్తులు కూడబెట్టారంటూ పనామా పత్రాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే.