కన్వీనర్ సీటూ ఖరీదే?

కన్వీనర్ సీటూ ఖరీదే?


సాక్షి, హైదరాబాద్: ప్రతిభ ఉన్నా పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్య భారం కానుంది. ఎంబీబీఎస్‌లో కన్వీనర్ కోటా సీట్ల ఫీజు భారీగా పెంచేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ విషయమై ఇప్పటికే రెండు దఫాలుగా సమావేశాలు జరిగాయి. మళ్లీ డిసెంబర్ మొదటి వారంలో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో చర్చలు జరపాలని వైద్య విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. గత ఏడాదే ఫీజుల పెంపునకు ప్రైవేటు కళాశాలలు తీవ్రంగా యత్నించినా చివరి నిమిషంలో పెంపు ఆగిపోయింది. అయితే ఈ ఏడాది ఫీజులు పెంచక తప్పదని అధికారులే చెబుతున్నారు. అందరికీ ఒకే రకంగా (కామన్) ఫీజు నిర్ణరుుంచాలని ప్రైవేటు కళాశాలలు డిమాండ్ చేస్తుండగా, కేటగిరీల వారీగా పెంచాలని అధికారులు అంటున్నారు. దీంతో కన్వీనర్, బీ కేటగిరీ, సీ కేటగిరీ సీట్ల విషయంలో దేనికి ఎంత ఫీజు పెంచుతారో తేలాల్సి ఉంది. దీనిపై ఇప్పటికే  ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్సీ) ఒక నిర్ణయానికి వచ్చిందని కూడా అధికారులు చెబుతున్నారు.

 

 అరుుతే ప్రైవేటు కళాశాలల్లో సీట్లు పొందే ప్రతి అభ్యర్థికీ కామన్ ఫీజుగా రూ.9 లక్షలు నిర్ణయించాలని యూజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. అలా నిర్ణయిస్తే యాజమాన్య కోటా సీట్లను కూడా ప్రతిభ ఆధారంగానే భర్తీ చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని ఆయా కళాశాలలు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదన ఇచ్చాయి. అయితే ప్రభుత్వం మాత్రం కేటగిరీలా వారీగా ఫీజులు నిర్ణయించాలని భావిస్తోంది. ఏ కేటగిరీ (కన్వీనర్ కోటా) ఫీజును రూ.60 వేల నుంచి రూ.3 లక్షలకు, బీ కేటగిరీ (కన్వీనర్ భర్తీ చేసే యూజమాన్య కోటా) ఫీజును రూ.2.40 లక్షల నుంచి రూ.5 లక్షలకు, సీ కేటగిరీ (పూర్తిగా యాజమాన్య కోటా) ఫీజును రూ.5.50 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచాలని అధికారులు భావిస్తున్నారు.

 

  అన్ని కేటగిరీలకూ రూ.9 లక్షలు నిర్ణయిస్తే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. గతంలోలా యాజమాన్య కోటా సీట్లను ఇష్టమొచ్చినట్టుగా భర్తీ చేసుకోవడానికి కుదరదని భారతీయ వైద్యమండలి (ఎంసీఐ) తేల్చిచెప్పింది. ఈ ఏడాది ప్రతిభ ఆధారంగా భర్తీ చేసుకోవాలని చెప్పింది. అయితే ఇంటర్ మార్కుల ఆధారంగా భర్తీ చేస్తారా, ఎంసెట్ మెరిట్ ఆధారంగా చేస్తారా, లేదంటే ప్రైవేటు వైద్య కళాశాలలన్నీ కలిసి ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించి (కర్ణాటక తరహాలో) భర్తీ చేసుకుంటారో మీరే తేల్చుకోవాలని సూచించింది. డిసెంబర్ లోగా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి తెలియజేస్తాయి. ఈలోగానే ఫీజులు వ్యవహారం కూడా తేలిపోయే అవకాశం ఉంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top