బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణంలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాకు బెయిల్ లభించింది.
న్యూఢిల్లీ : బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణంలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాకు బెయిల్ లభించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఏడుగురికి కూడా బుధవారం ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, జార్ఖండ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ బసులు బెయిల్ లభించినవారిలో ఉన్నారు. ఈ కేసులో ఎనిమిది మందికి బెయిల్ మంజూరు చేసినట్లు సీబీఐ ప్రత్యేక జడ్జి ప్రభాత్ ప్రశార్ పేర్కొన్నారు. ఒక్కొక్కరు లక్షరూపాయల వ్యక్తిగత బాండ్లు, అంతే మొత్తంలో పూచీకత్తు సమర్పించాలని షరతు విధించారు.
ఈ కేసు తదుపరి విచారణను మార్చి 4కు వాయిదా వేశారు. వాదనల సందర్భంగా వీరికి బెయిల్ ఇవ్వకూడదని సీబీఐ కోర్టును కోరింది. వీరంతా అధికార దుర్వినియోగంతోపాటు కుట్రపూరిత చర్యలకు పాల్పడ్డారని, వినీ ఐరన్ అండ్ స్టీల్ ఉద్యోగ్ లిమిటెడ్ అనే కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారని సీబీఐ వాదించింది. వీరికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని తెలిపింది. ఇందులో హెచ్‌సీ గుప్తా గతంలో ప్రధాని కార్యాలయాన్ని కూడా తప్పుదోవ పట్టించారని సీబీఐ, ప్రత్యేక కోర్టు దృష్టికి తీసుకువచ్చింది.