ట్రంప్ భార్యపై చంద్రబాబు వ్యాఖ్యలు!
కుటుంబ విలువలగురించి ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: కుటుంబ విలువల గురించి ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఉన్న నైతిక విలువలు ప్రపంచంలో ఎక్కడా లేవని కొనియాడారు. ‘అమెరికాలో ఎన్నెన్ని పెళ్లిళ్లు చేసుకుంటారో మనం చూస్తున్నాం. ట్రంప్‌కు ఇప్పుడున్నావిడ నాలుగో భార్య అనుకుంటా’ అని వ్యాఖ్యానించారు. అన్ని పెళ్లిళ్లు చేసుకోవడం తాత్కాలిక ఎంజాయ్‌మెంట్ మాత్రమేనని పేర్కొన్నారు. మన ఆనందానికి కారణం కుటుంబ బంధమేనని ఆయన చెప్పారు. ఏపీకి కష్టాలు, అవమానాలు ఎదురవ్వడంతోనే అమరావతికి తిరిగొచ్చామని చంద్రబాబు అన్నారు.
8 నెలల్లోనే సచివాలయం నిర్మాణం పూర్తిచేశామని చెప్పారు. డ్వాక్రా సంఘాలను తానే ప్రారంభించానని, డ్వాక్రా సంఘాలకు రూ. 2,500 కోట్లు విడుదల చేస్తామని చెప్పారు. డ్వాక్రా మహిళల రుణమాఫీ ఫైల్‌పై ఆయన సంతకం చేశారు. ఇక అమరావతిలో వరదలు వచ్చే అవకాశముందని కొందరు అంటున్నారని, హైదరాబాద్‌లోనూ, చెన్నైలోనూ వరదలు రాలేదా? హైదరాబాద్‌లో వరదలు వస్తాయని ఎవరైనా ఊహించారా? అని వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
- డబుల్ డిజిట్ గ్రోత్‌కు అవకాశం ఉన్న ఏకైక దేశం.. భారతదేశం
- చైనా ఆర్థికవ్యవస్థ పడిపోయిన తర్వాత ప్రపంచం భారతదేశం వైపు చూస్తోంది
- ట్రంప్ మాటలు చూస్తుంటే.. అగ్రదేశం అమెరికాలో కూడా నాయకత్వలేమి ఉంది
- మన ఆనందానికి ప్రధాన కారణం.. కుటుంబ బంధం
- చైనాలో కూడా ఇప్పుడు ఆ విలువలు లేవు
- మనం సమష్టి కుటుంబంలో ఉంటున్నాం.. ఇప్పుడు కొన్ని మారుతున్నాయి.. అలా మారకూడదు
- ఏసీ రూంలో పనిచేసుకున్న తర్వాత కూడా మనం ఇంటికి వెళ్లి గడపాలి
- అంతేతప్ప రోబోలతో ఆడుకోకూడదు
- ఇంట్లో పనులు చేయడానికి ఆడ రోబోలను కూడా తయారుచేస్తున్నారట
- మనుషులకు స్వార్థం పెరిగిపోతోంది.. డబ్బులుంటే ఏమైనా చేయచ్చని అనుకుంటున్నారు
- డబ్బులుంటే సమాజం గౌరవిస్తుందని అడ్డదిడ్డంగా సంపాదిస్తున్నారు
- డబ్బులు వస్తూనే ఏం చేయాలో తెలియదు కాబట్టి ఎంజాయ్ చేయడం మొదలుపెడతారు
- దీనంతటికీ కారణం బ్యాంకు లావాదేవీలు కాకుండా.. నగదు లావాదేవీలే
- ఏ పని చేయాలన్నా స్మార్ట్ ఫోన్ చాలు.. ఎవరికైనా డబ్బులివ్వాలన్నా, షాపింగ్ చేయాలన్నా అది చాలు


