సీమాంధ్రకు బాబు ద్రోహం | Chandrababu Naidu cheats Seemandhra People, says Ambati rambabu | Sakshi
Sakshi News home page

సీమాంధ్రకు బాబు ద్రోహం

Oct 5 2013 4:13 AM | Updated on May 25 2018 9:10 PM

సీమాంధ్రకు బాబు ద్రోహం - Sakshi

సీమాంధ్రకు బాబు ద్రోహం

ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తూ కేంద్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి నిరసనగా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమరణ నిరాహారదీక్షను చేపడుతుంటే.

టీడీపీ అధ్యక్షుడిపై అంబటి ఆగ్రహం
 త్వరగా విభజించాలని దీక్ష చేయడం అన్యాయం
దేనికో భయపడే సీఎం రమేష్‌తో రాయబారం
 సీడబ్ల్యూసీ నిర్ణయం అమలుకు అప్పుడే ఒప్పందం
మీరు కాంగ్రెస్‌తో కుమ్మక్కై మమ్మల్ని అంటారా?

 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తూ కేంద్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి నిరసనగా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమరణ నిరాహారదీక్షను చేపడుతుంటే.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని త్వరగా విభజించాలని కోరుతూ ఢిల్లీలో నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించడం అన్యాయం, దురదృష్టకరమని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. సీమాంధ్ర అంతా ఆందోళనలతో భగ్గుమంటోంటే రాష్ట్ర విభజన త్వరగా చేయాలని దీక్ష చేయడం ఆ ప్రాంత ప్రజలకు ద్రోహం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 చంద్రబాబు దేనికో భయపడి తన షాడో అయిన సీఎం రమేష్‌ను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇంటికి కాళ్లబేరానికి పంపారని అంబటి విమర్శించారు. సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి సహకరిస్తామని బాబు ఈ సందర్భంగా ఒప్పందం చేసుకున్నారని అన్నారు. ‘అలాంటి చంద్రబాబు.. కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయ్యారని మమ్మల్ని అంటారా?’ అని అంబటి మండిపడ్డారు. ఆయన శుక్రవారం ఇక్కడ ‘సాక్షి’తో మాట్లాడారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రాజకీయ పార్టీ పెట్టినందుకు అన్యాయంగా, అక్రమంగా 16 నెలలు జైల్లో ఉండి, ఎన్నో కష్టాలు పడిన జగన్.. బయటకు వచ్చిన తరువాత కూడా రాష్ట్ర ప్రజానీకం కష్టాల కన్నా తన కష్టాలు ఎక్కువకాదనే భావనతో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాడుతున్నారని ఆయన అన్నారు. ‘అలాంటి జగన్ కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయ్యారా? సీడ బ్ల్యూసీ నిర్ణయాన్ని అమలు చేయడానికి ఆత్రత పడుతున్న చంద్రబాబు కుమ్మక్కయ్యాడా?..’ అని ప్రశ్నించారు. బాబు చెప్పే బుర్రకథలు, హరికథలు వినడానికి తెలుగు ప్రజలు సిద్ధంగా లేరన్నారు.
 
  తెలంగాణ, సీమాంధ్ర నాయకులిద్దరినీ వెంటబెట్టుకుని వెళ్లి విభజన త్వరితగతిన కావాలని, జగన్‌కు బెయిల్ రాకూడదని రాష్ట్రపతితో సహా ఎంతోమంది నేతలకు చెప్పినటువంటి చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారా, లేక జగన్ కుమ్మక్కయ్యారా? అని ప్రశ్నించారు. ‘టీడీపీ నేతలు నామా నాగేశ్వరరావు, ఎరబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి వంటి నాయకులంతా తెలంగాణ ప్రక్రియ ప్రారంభం అయిందని కేకులు కట్ చేసుకుని ఓ వైపు సంబరాలు చేసుకుంటుంటే.. మరోవైపు చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లి రాష్ట్ర విభజన త్వరగా జరగాలని దీక్ష చేయడం తెలుగు జాతికి ద్రోహం చేయడం కాదా?’ అని ప్రశ్నించారు. సీమాంధ్రలో పుట్టి, ఇక్కడే పెరిగి, సీమాంధ్రుల దయాదాక్షిణ్యాలతో ఎమ్మెల్యే, సీఎం అయిన బాబు, సీమాంధ్ర రోదనలను పట్టించుకోకుండా ప్రత్యేక తెలంగాణ కోసం దీక్ష చేయడం దారుణమనీ, చంద్రబాబు చరిత్రహీనులుగా మిగిలిపోతారని అంబటి విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement