‘ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్’పై 11ఏళ్ల నిషేధం: కావూరి సాంబశివరావు | Central minister kavuri's construction company banned for 11 years | Sakshi
Sakshi News home page

‘ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్’పై 11ఏళ్ల నిషేధం: కావూరి సాంబశివరావు

Nov 28 2013 2:34 AM | Updated on Mar 18 2019 7:55 PM

‘ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్’పై 11ఏళ్ల నిషేధం: కావూరి సాంబశివరావు - Sakshi

‘ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్’పై 11ఏళ్ల నిషేధం: కావూరి సాంబశివరావు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి కావూరి సాంబశివరావుకు చెందిన ‘ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్(పీసీఎల్)’ సంస్థను ప్రపంచబ్యాంక్ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది.

కావూరి సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన ప్రపంచ బ్యాంకు
 నిబంధనల ఉల్లంఘనే కారణమని వెల్లడి


 వాషింగ్టన్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి కావూరి సాంబశివరావుకు చెందిన ‘ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్(పీసీఎల్)’ సంస్థను ప్రపంచబ్యాంక్ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. మోసం, అవినీతి పూరిత పద్ధతులకు వ్యతిరేకంగా బ్యాంకు రూపొందించిన నిబంధనలను (ఫ్రాడ్ అండ్ కరప్షన్ పాలసీ) ఉల్లంఘించడంవల్ల ఆ సంస్థను ఈనెల 26 నుంచి కనీసం 11 ఏళ్ల పాటు నిషేధిస్తున్నామని ప్రకటించింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా పీసీఎల్ నియంత్రిస్తున్న అన్ని సంస్థలకు ఈ అనర్హత వేటు వర్తిస్తుందని స్పష్టం చేసింది. తాము ఆర్థికసాయం చేసే ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని ‘ప్రొక్యూర్‌మెంట్ గైడ్‌లైన్స్’ను ప్రపంచబ్యాంకు రూపొందిస్తుందని, ఆయా ప్రాజెక్ట్‌ల్లో భాగస్వాములైన కంపెనీలు ఆ నిబంధనలను పాటించాలని.. వాటిని ఉల్లంఘించడంవల్ల హైదరాబాద్‌కు చెందిన  ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్ సంస్థపై చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని బ్యాంక్ పేర్కొంది.

 

అయితే, నిషేధం వర్తించే పీసీఎల్ సోదర సంస్థలు, ప్రాజెక్టులు, కాంట్రాక్టుల వివరాలను బ్యాంక్ వెల్లడించలేదు. అలాగే పీసీఎల్ ఉల్లంఘించిన నిబంధనల వివరాలను కూడా తెలపలేదు. దాంతోపాటు ఆ సంస్థ ప్రమోటర్లు, ఉన్నతాధికారుల పేర్లను కూడా ప్రపంచబ్యాంక్ పేర్కొనలేదు. పీసీఎల్ వెబ్‌సైట్‌లో మాత్రం ఆ సంస్థను ప్రస్తుత కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు 1966లో స్థాపించారని ఉంది. అది 1982లో ప్రైవేట్ లిమిటెడ్‌గా మారింది. ప్రస్తుతం ఆ సంస్థకు ముళ్లపూడి శ్రీవాణి మేనేజింగ్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. పీసీఎల్ విద్యుత్, నీటిపారుదల, రైల్వే, రవాణ, గృహనిర్మాణం, పారిశ్రామిక రంగాల్లోని మౌలిక వసతుల కల్పనలో వ్యాపారాలు నిర్వహిస్తోంది.  


 కాగా, నిషేధం విషయంపై స్పందన కోరేందుకు చేసిన ప్రయత్నాలకు పీసీఎల్ సంస్థ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. కావూరి సాంబశివరావుకు, ఆయన కార్యాలయానికి చేసిన ఫోన్లకు, మెసేజ్‌లకు కూడా జవాబు రాలేదు. ప్రపంచబ్యాంక్ నిషేధానికి గతంలో గురైన వాటిలో సత్యం, విప్రో, వీడియోకాన్, ఎల్ అండ్ టీ.. తదితర కంపెనీలున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement