ఘనంగా ముగిసిన సాంస్కృతిక మేళా | Celebrated the end of the Cultural Mela | Sakshi
Sakshi News home page

ఘనంగా ముగిసిన సాంస్కృతిక మేళా

Mar 14 2016 3:54 AM | Updated on Sep 3 2017 7:40 PM

ఘనంగా ముగిసిన సాంస్కృతిక మేళా

ఘనంగా ముగిసిన సాంస్కృతిక మేళా

దేశ ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాల్ని పార్టీలు రాజకీయం చేయకూడదని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్

దేశ ప్రతిష్ట పెంచే సభలపై రాజకీయాలు వద్దు: శ్రీశ్రీ రవిశంకర్
 
న్యూఢిల్లీ: దేశ ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాల్ని పార్టీలు రాజకీయం చేయకూడదని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ చెప్పారు. ప్రపంచ సాంస్కృతిక ఉత్సవంపై విమర్శల  సందర్భంగా మీడియా కఠినంగా వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో యుమునా తీరంలో ఆదివారం ప్రపంచ సాంస్కృతిక సంగమం ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ... వచ్చే సదస్సు కోసం ఆస్ట్రేలియా, మెక్సికో, ఇతర దేశాల నుంచి ఇప్పటికే ఆహ్వానాలు అందాయన్నారు. పార్టీలన్నీ కలసికట్టుగా తరలివస్తే ప్రపంచ వేదికపై భారత ప్రతిష్ట పెరుగుతుందన్నారు. ఇంత పెద్ద సదస్సు నిర్వహించడం  తేలిక కాదని, అందువల్లే ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ప్రజలు కలుసుకునే అవకాశం కలిగిందన్నారు. కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు మాట్లాడుతూ... గందరగోళం ఉంటే నాయకత్వానికి అర్థమే లేదని, ఏకీకృత సాంఘిక విధానం కంటే వివిధ సంస్కృతుల సమ్మేళనం భారత్‌ను గొప్ప నాగరికత వైపు తీసుకెళ్తుందన్నారు.

జీవవైవిధ్యంతో మన జీవితాల్ని సుసంపన్నం చేస్తున్న ప్రకృతి నుంచి ప్రజలు ఎన్నో నేర్చుకోవాలన్నారు. సంస్కృతి లేకపోతే జీవితానికి అర్థం ఉండేది కాదని, కొన్ని వివాదాలకు అది కారణమైనా క్రమంగా సమాజంలో శాంతిని తీసుకొచ్చిందని చెప్పారు. ఉన్నత ఆశయాలు, మానవత్వం సరిహద్దులు దాటాయనడానికి 160 దేశాల ప్రజలు ఒకే వేదిక పంచుకోవడమే నిదర్శనమని  కేంద్ర మంత్రి  పీయుష్ గోయల్ అన్నారు. నాయకత్వ విలువల పతనం, మంచి నేతలుగా ఎలా ఎదగాలో అన్న అంశాలపై కేంద్ర మంత్రి వీకే సింగ్, నార్వే మాజీ ప్రధాని కెల్ మాగ్నే బాండ్వెక్‌లు సూచనలు చేశారు. నాయకుడు ఎప్పుడూ ఆదర్శంగా ఉండాలని, భయపెట్టకూడదని వీకే సింగ్ అన్నారు. మూడో రోజు కార్యక్రమంలో వివిధ దేశాల నుంచి వచ్చిన కళాకారులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.  కేంద్ర మంత్రులు వెంకయ్య, గడ్కారీ, నిర్మలా సీతారామన్, నేపాల్ ఉప ప్రధాని కమల్ థాపా తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ దేశాల నుంచి ఆహ్వానం..
రవిశంకర్‌కు ప్రపంచనేతల నుంచి ఆహ్వానాలు, ప్రశంసలు వెల్లువెత్తాయి. హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రసంగించాని బ్రిటన్ ప్రధాని కామెరాన్ ఆహ్వానించారు. ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాన్ని తమ దేశంలో జరపాలని ఆస్ట్రేలియా ప్రధాని  టర్న్‌బుల్ కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement