
ఆఫ్రికన్ దేశాల్లో బీజేపీ కార్యాలయాలు!
విదేశాల్లో పార్టీ విభాగాలను ఏర్పాటు చేయడానికి బీజేపీ కసరత్తులు ఆరంభించింది.
నైరోబి: ఆఫ్రికన్ దేశాల్లో మరిన్ని పార్టీ విభాగాలను ఏర్పాటు చేయడానికి బీజేపీ కసరత్తులు ఆరంభించింది. ఇప్పటికే పలు ఆఫ్రికన్ దేశాల్లో బీజేపీ కార్యాలయాలను ప్రారంభించిన పార్టీ నాయకత్వం దాన్ని మరింత విస్తరించేందుకు రంగం సిద్దం చేసింది. త్వరలో ఆఫ్రికన్ దేశమైన కెన్యాలో బీజేపీ విదేశీ కార్యాలయాన్ని ఆరంభించనుంది. ఇందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసిన బీజేపీ .. ఇథోపియా, రవ్వాండా, తంజానియా, జింబాబ్వే తదితర దేశాల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టింది.
గత వారం కెనడా, డెన్మార్క్ , ఉగండాలలో భారతీయ జనతా (బీజేపీ) పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కెన్యాలో బీజేపీకి చక్కటి వ్యవస్థగత నిర్మాణం ఉందని, అందుచేత ఆ దేశంలోని ప్రధాన పట్టణాల్లో బీజేపీ కో-ఆర్డినేటర్లను ఏర్పాటు చేసినట్లు బీజేపీ ఓవర్ సీస్ అధ్యక్షుడు విమల్ చద్దా స్సష్టం చేశారు. గత ఐదు సంవత్సరాల నుంచి స్థానికంగా పలు సేవా కార్యాలయాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ తరహా విధానం వల్ల భారత్ తో ఆఫ్రికన్ దేశాలకు సఖ్యత పెరిగి మరింత లబ్ది చేకూర్చే అవకాశం ఉందన్నారు.