టెన్త్‌ విద్యార్థులకు 'ఫిజిక్స్‌' ఫీవర్‌ | Beyond level questions in Tenth class Physics exam | Sakshi
Sakshi News home page

టెన్త్‌ విద్యార్థులకు 'ఫిజిక్స్‌' ఫీవర్‌

Mar 27 2017 1:26 AM | Updated on Sep 5 2017 7:09 AM

టెన్త్‌ విద్యార్థులకు 'ఫిజిక్స్‌' ఫీవర్‌

టెన్త్‌ విద్యార్థులకు 'ఫిజిక్స్‌' ఫీవర్‌

పదో తరగతి విద్యార్థిని ఇంటర్‌ స్థాయి ప్రశ్నలు ఎలా అడిగారు? ప్రతిభావంతుడైన విద్యార్థికి సైతం పరీక్షలో అసలు పాసవుతామా అని బెంగ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?

పాసవుతామా లేదా అని విద్యార్థుల బెంగ
- సబ్జెక్ట్‌ టీచర్లకు బదులు లెక్చరర్లతో ప్రశ్నపత్రం రూపకల్పన!
- ఫలితంగా విద్యార్థుల స్థాయికి మించి ప్రశ్నలు
- 13, 17 ప్రశ్నలకు 6 మార్కులు కలిపే అవకాశం
- నేడు నిపుణుల కమిటీతో పరీక్షల విభాగం డైరెక్టర్‌ భేటీ
- విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూస్తామంటున్న అధికారులు
- కనీసం 16 మార్కులు కలపాలి: రాష్ట్ర ఫిజికల్‌ సైన్స్‌ ఫోరం


సాక్షి, హైదరాబాద్‌:
పదో తరగతి విద్యార్థిని ఇంటర్‌ స్థాయి ప్రశ్నలు ఎలా అడిగారు? కొన్ని ప్రశ్నలైతే ఏకంగా జేఈఈ మెయిన్‌ స్థాయిలో ఎలా వచ్చాయి? ప్రతిభావంతుడైన విద్యార్థికి సైతం పరీక్షలో అసలు పాసవుతామా అని బెంగ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ప్రశ్నపత్రం రూపకల్పన నిబంధనలు పాటించారా? శనివారం విద్యార్థులకు చుక్కలు చూపిన టెన్త్‌ ఫిజిక్స్‌ ఎగ్జామ్‌పై తలెత్తుతున్న సందేహాలివీ! సీనియర్‌ సబ్జెక్టు టీచర్ల ఆధ్వర్యంలో తయారవ్వాల్సిన ఈ ప్రశ్నపత్రం లెక్చరర్ల కనుసన్నలో తయారైనట్లు తెలుస్తోంది. అందువల్లే ఎన్నడూ లేని విధంగా అత్యంత కఠినంగా ప్రశ్నలు వచ్చాయని, ప్రతిభావంతులైన విద్యార్థులు సైతం ప్రశ్నపత్రం చూడగానే తెల్లముఖం వేశారని చెబుతున్నారు.

వాస్తవానికి ప్రశ్నపత్రం రూపకల్పనలో సబ్జెక్టు టీచర్లైన ఆరుగురు ఉపాధ్యాయులు ఆరు రకాల ప్రశ్నపత్రాల్ని తయారు చేస్తారు. అనంతరం వీటిని మోడరేటర్లు(సీనియర్‌ సబ్జెక్టు టీచర్లు) పరిశీలించి బ్లూప్రింట్‌ ఆధారంగా క్వశ్చన్‌ పేపర్‌ ఖరారు చేస్తారు. బ్లూప్రింట్‌ నిబంధనల ప్రకారం.. ప్రశ్నపత్రం తయారీలో మూడు కేటగిరీలుగా ప్రశ్నలను ఎంపిక చేయాలి. 50 శాతం సాధారణ, సులభతరమైన ప్రశ్నలు, 30 శాతం స్టాండర్డ్‌ ప్రశ్నలు, 20 శాతం కఠినమైన ప్రశ్నలను నిర్దేశిస్తూ ప్రశ్నపత్రాన్ని రూపొందించాలి. కానీ టెన్త్‌ జనరల్‌ సైన్స్‌–1 ప్రశ్నపత్రంలో ఈ నిబంధనలు పాటించలేదు. పాఠ్యాంశంలో లేని ప్రశ్నలు ఎక్కువగా రావడంతో విద్యార్థులు పరీక్ష హాలులోనే బిత్తరపోవాల్సి వచ్చింది.

మోడరేటర్లుగా లెక్చరర్లు!
ప్రశ్నపత్రం తయారీ బృందంలో నిపుణులైన ఆరుగురు టీచర్లతో పాటు ఇద్దరు సీనియర్‌ సబ్జెక్టు టీచర్లు ఉంటారు. ఆరుగురు నిపుణుల బృందం తయారు చేసిన ప్రశ్నపత్రాన్ని పరిశీలించి ఖరారు చేయాల్సిన బాధ్యత సీనియర్‌ సబ్జెక్టు టీచర్లపై ఉంటుంది. కానీ తాజాగా టెన్త్‌ జనరల్‌ సైన్స్‌–1 పేపర్‌ తయారు చేసిన బృందంలో లెక్చరర్లు ఉన్నట్లు తెలిసింది. సీనియర్‌ సబ్జెక్టు టీచర్ల స్థానంలో ఉన్న ఇదర్దూ లెక్చరర్లే కావడంతో విద్యార్థుల సామర్థ్యానికి మించిన ప్రశ్నలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రశ్నపత్రం గందరగోళంగా మారింది. సాధారణంగా ప్రశ్నపత్రం రూపకల్పనలో టీచర్ల ఎంపికను ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారులే నిర్ణయించాలి. కానీ బోర్డుకు సంబంధం లేని అధికారుల ప్రమేయంతో మోడరేటర్ల నియామకం జరిగినట్లు విశ్వసనీయ సమాచారం.

ఆ ప్రశ్నలకు ఆరు మార్కులు..
శనివారం జరిగిన జనరల్‌ సైన్స్‌–1లో 13, 17వ ప్రశ్నలకు సంబంధించిన కాన్సెప్ట్‌ పాఠ్య పుస్తకంలోనే లేదు. 13వ ప్రశ్నలో ఒక పైపులో రెండు లెన్స్‌ సెట్‌ చేసి చందమామను చూస్తే ఎలా కనిపిస్తుందని అడిగారు. అలాగే 17 (ఏ) ప్రశ్నలో ఫార్ములాను బేస్‌ చేసుకొని ప్రశ్న ఇచ్చారు. ఈ రెండింటికి పుస్తకంలో సమాధానాలు లేవని నిపుణులు చెబుతున్నారు. ఇవి సిలబస్‌లో లేని ప్రశ్నలు అయినందున ఈ రెండు ప్రశ్నలకు (13వ ప్రశ్నకు 2, 17 ప్రశ్నకు 4) విద్యార్థులకు 6 మార్కులు కలుపుతారని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

నేడు నిపుణుల కమిటీతో భేటీ
టెన్త్‌ ఫిజికల్‌ సైన్స్‌ పేపర్‌–1 విషయంలో సోమవారం పేపర్‌ సెట్టర్స్, మోడరేటర్స్, సబ్జెక్టుల నిపుణుల కమిటీతో సమావేశం నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ సురేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం నాటి పరీక్షలో ఔట్‌ ఆఫ్‌ ది సిలబస్‌ ప్రశ్నలు లేవని, అయితే పాఠ్య పుస్తకంలోని కాన్సెప్ట్‌కు అనుగుణంగా రెండు ప్రశ్నలు ట్విస్ట్‌ చేసి ఇచ్చినట్లు ఆయన వివరించారు. 13, 17వ ప్రశ్నలను ఇలా ఇచ్చారని, వాటికి సంబంధించి నిపుణుల కమిటీతో పరిశీలన జరుపుతామని చెప్పారు. కమిటీ పరిశీలన తర్వాత అవసరమైతే యాడ్‌ ఆన్‌ స్కోర్‌ ఇస్తామని, విద్యార్థులకు ఎలాంటి నష్టం కలుగకుండా చర్యలు చేపడతామని వెల్లడించారు.

కనీసం 16 మార్కులు కలపాలి
‘‘పరీక్షలో వచ్చిన ప్రశ్నలు పదో తరగతి విద్యార్థి స్ధాయికి మించి ఉన్నాయి. విద్యార్థి సామర్థ్యానికి అనుగుణంగా.. జీవో 17 ప్రకారం తయారు చేసిన బ్లూప్రింట్‌ ప్రకారం ప్రశ్నపత్రం లేదు. అందువల్ల ప్రతి విద్యార్థికి కనీసం 16 మార్కులను కలపాలి. మున్ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా... ఎన్‌సీఈఆర్టీ, డీజీఈ, సీ అండ్‌ డీఎస్‌ఈ ఆధ్వర్యంలో పరీక్ష పేపర్‌ తయారీకి శాశ్వత ప్యానెల్‌ ఏర్పాటు చేయాలి. ఎన్‌సీఈఆర్‌టీ తయారు చేసినట్లుగా రాష్ట్రంలోనూ పాఠ్యపుస్తకం ఆధారంగా ప్రశ్నల నిధిని ఏర్పాటు చేసుకోవాలి. దీంతోపాటు ఫిజికల్‌ సైన్స్‌ పేపర్‌ను రెండు పేపర్లుగా (భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం) వేర్వేరుగా నిర్వహించాలి.
– సాయి ప్రసాద్‌రావు, రాష్ట్ర ఫోరం ఆఫ్‌ ఫిజికల్‌ సైన్స్‌ అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement