రచయితగా మరణించా... ఒంటరిగా వదిలేయండి

రచయితగా మరణించా... ఒంటరిగా వదిలేయండి


తమిళ రచయిత సంచలన ప్రకటన

‘మధోరుభగన్’ నవల వివాదమే కారణం




చెన్నై: తమిళనాడులో హిందుత్వవాదుల ఆగ్రహానికి గురైన ప్రముఖ నవలా రచయిత ప్రొఫెసర్ పెరుమాళ్ మురుగన్ తాను ‘రచయితగా మరణించాన’ని మంగళవారం ప్రకటించారు. తనకు పునర్జన్మపై విశ్వాసం లేదు గనుక ఒక సాధారణ అధ్యాపకుడిగా జీవితం కొనసాగిస్తానన్నారు. ఇకపై ఎవరూ కలవడానికి ప్రయత్నించవద్దని, సాహిత్య సమావేశాలకు ఆహ్వానించవద్దని, తనను ఒంటరిగా వదిలేయాలని విజ్ఞప్తిచేశారు.



తన నవలలు, కథానికలు, కవిత్వం, ఇతర సృజనాత్మక రచనల అమ్మకాలను నిలిపేయాలని ప్రచురణకర్తలను ఆయన కోరారు. ఇలా నిలిపేయడంవల్ల కలిగే నష్టాన్ని తాను భరిస్తానని మురుగన్ చెప్పారు. నూటపాతికేళ్ల నాడు తిరుచెంగోడు ప్రాంతంలో నెలకొన్న ఒక ఆచారం నేపథ్యంగా ఆయన ‘మధోరుభగన్’ పేరిట నాలుగేళ్ల క్రితం ఒక నవల రచించారు. ప్రముఖ ప్రచురణల సంస్థ పెంగ్విన్ దాని ఆంగ్లానువాదాన్ని గతేడాది వెలువరించింది.



ఈ నవలపై తిరుచెంగోడులోని ఆరెస్సెస్ శాఖ, హిందూ మున్నాని, కొన్ని కులసంఘాలు గత నెలలో తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. బంద్‌లు, హర్తాళ్లు నిర్వహించాయి. శాంతిభద్రతల సమస్య తలెత్తడంతో మురుగన్ కుటుంబంతో సహా అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. సంతానం లేని మహిళలు ఒక తిరునాళ్ల సందర్భంగా ఆలయంలో అపరిచితులతో శారీరకంగా కలవడం ప్రధానాంశంగా మురుగన్ ఈ నవల రాశారు. 



సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి వీఆర్ సుబ్బులక్ష్మి ఆధ్వర్యంలో మత సంస్థలు, కుల సంఘాలతో సమావేశం జరిగింది. ఇందులో మురుగన్ కూడా పాల్గొన్నారు. బేషరతుగా క్షమాపణ చెప్పడానికి, నవల ఉపసంహరణకు ఆయన హామీ ఇచ్చారు. ఆయనపై దాఖలుచేసిన కేసుల ఉపసంహరణకు హిందుత్వ సంస్థలు కూడా అంగీకరించాయి. వివాదం సమయంలో మురుగన్‌కు పలు సాహితీ సంస్థలు, రచయితలు అండగా నిలిచారు. అవసరమైతే న్యాయస్థానానికి వెళ్లడానికి తాము సిద్ధమేనని ప్రచురణకర్తలు కూడా ప్రకటించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top