అమరావతి పేరుతో బాండ్ల జారీ! | ap govt to issue bonds with the name of amaravathi | Sakshi
Sakshi News home page

అమరావతి పేరుతో బాండ్ల జారీ!

Sep 8 2015 8:29 AM | Updated on Aug 18 2018 5:50 PM

అమరావతి పేరుతో బాండ్ల జారీ! - Sakshi

అమరావతి పేరుతో బాండ్ల జారీ!

నూతన రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులను సమీకరించేందుకు అమరావతి పేరుతో బాండ్లు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులను సమీకరించేందుకు అమరావతి పేరుతో బాండ్లు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశంలో రెండుసార్లు చర్చించారు. ‘అమరావతి మౌలిక వసతుల కల్పన ’ పేరుతో బాండ్లను జారీ చేయాలని రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

రాజధాని నిర్మాణానికి వచ్చే పదేళ్లలో రూ.53,547 కోట్లు అవసరమని సీఆర్‌డీఏ అంచనా వేసింది. ఇందులో కొంత మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం గ్రాంట్‌గా మంజూరు చేసినా మిగతా నిధులను సమీకరించాల్సి ఉంటుందని ఇటీవల సీఆర్‌డీఏ సమీక్షా సమావేశంలో సీఎం అభిప్రాయపడ్డారు. అమరావతిపై ప్రజల్లో సెంటిమెంట్ ఉన్నందున అదే పేరుతో వడ్డీపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేని బాండ్లను జారీ చేయాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వంతోపాటు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. బాండ్ల జారీకి  విధివిధానాలను ఖరారు చేయడానికి కన్సల్టెంట్‌ను నియమించాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది.

ఈ బాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుందని సీఆర్‌డీఏ పేర్కొంది. ‘సెబీ’ మార్గదర్శకాలను కూడా అమలు చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలి పాయి. క్రెడిట్ రేటింగ్ ఆధారంగా మున్సిపల్ రెవెన్యూ బాండ్లా లేదా మౌలిక వసతుల బాండ్లా అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అమరావతి పేరుతో బాండ్ల జారీతోపాటు పలు రంగాల ద్వారా నిధుల సమీకరణకు ప్రణాళికలను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పి.వి.రమేశ్‌కు సూచించారు.

సింగపూర్ శిక్షణకు 25 మంది అధికారులు
సింగపూర్ సంస్థలు చెప్పే పాఠాలు వినడానికి, శిక్షణ పొందడానికి సీఆర్‌డీఏకు చెందిన 25 మంది అధికారులు ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు సింగపూర్‌లో ఉండనున్నారు. నూతన రాజధాని అమరావతిలో భూ వినియోగం, రవాణా వ్యవస్థ, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రైవేట్, పబ్లిక్, సామాజిక రంగాల గృహాల నిర్మాణం, గ్రీనరీ, పారిశ్రామిక, ఆర్థిక పురోగతి తదితర అంశాలపై సింగపూర్‌లో సీఆర్‌డీఏ అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు.

‘ఆంధ్రప్రదేశ్ లీడర్స్ ఇన్ అర్బన్ గవర్నెన్స్ పోగ్రామ్’ పేరుతో ఈ  శిక్షణ  ఉంటుంది. దీని ద్వారా అధికారుల్లో నైపుణ్యాలను పెంచి, సమర్థ పాలన అందించడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సింగపూర్ కంపెనీలు సమర్పించిన రాజధాని మాస్టర్ ప్రణాళికను ఎలా అమలు చేయాలో సింగపూర్ సంస్థలు వివరిస్తాయి. ఇందుకయ్యే రూ.4 లక్షల వ్యయాన్ని సీఆర్‌డీఏ భరించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement