కాంగ్రెస్‌ రికార్డును బద్దలుకొట్టిన బీజేపీ | 65years of congress record breaked , bjp become largest party in rajya sabha | Sakshi
Sakshi News home page

ఫస్ట్‌ టైమ్‌: కాంగ్రెస్‌ రికార్డును బద్దలుకొట్టిన బీజేపీ

Aug 4 2017 12:19 PM | Updated on Mar 29 2019 9:31 PM

బీజేపీ సభలో అమిత్‌షా(ఇన్‌సెట్‌ ఎంపీ సంపతియా) - Sakshi

బీజేపీ సభలో అమిత్‌షా(ఇన్‌సెట్‌ ఎంపీ సంపతియా)

‘కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌’ నినాదంతో దూసుకుపోతున్న బీజేపీ.. రాజ్యసభ చరిత్రలోనే మొట్టమొదటిసారి అతిపెద్ద పార్టీగా అవతరించింది.

న్యూఢిల్లీ: ‘కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌’ నినాదంతో దూసుకుపోతున్న బీజేపీ.. రాజ్యసభ చరిత్రలోనే మొట్టమొదటిసారి అతిపెద్ద పార్టీగా అవతరించింది.

కేంద్ర మంత్రి అనిల్‌ దవే ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన మధ్యప్రదేశ్‌ స్థానం నుంచి సంపతియా వూకే గెలుపొందారు. ఆమె గురువారం ఎంపీగా ప్రమాణం చేయడంతో.. 245 స్థానాలున్న పెద్దల సభలో బీజేపీ బలం 58కి పెరిగింది.

తెలంగాణకు చెందిన పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, మణిపూర్‌కు చెందిన హజీ అబ్దుల్‌ సలామ్‌ల మరణాలతో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీల సంఖ్య 57కు పడిపోయింది. దీంతో 65 ఏళ్ల రాజ్యసభలో అతిపెద్ద పార్టీగా కొనసాగుతున్న కాంగ్రెస్‌ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. అయినప్పటికీ, అధికార ఎన్డీఏకు పెద్దలసభలో మెజారిటీ లేకపోవడం గమనార్హం.

నిజానికి ‘పెద్ద పార్టీ’గా కాంగ్రెస్‌ 2018 వరకూ కొనసాగాల్సి ఉన్నా, సభ్యుల అకాలమరణాలతో ముందుగానే రికార్డు కోల్పోవాల్సి వచ్చింది. ఇక ముందు కూడా కాంగ్రెస్‌ కోలుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే.. ఆగస్టు 8న గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌లలోని 9 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో మూడు సీట్లున్న గుజరాత్‌లో రెండింటిలో బీజేపీ విజయం ఖాయమైపోయింది.

మిగిలిన ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకుని అహ్మద్‌ పటేల్‌(సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి)ని రాజ్యసభకు రానీయకూడదని బీజేపీ ఎత్తులు వేస్తోంది. దీంతో కాంగ్రెస్‌ తన ఎమ్మెల్యేలను బెంగళూరు క్యాంపునకు తరలించిన సంగతి తెలిసిందే. ఇక పశ్చిమబెంగాల్లోని 6 స్థానాల్లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ 5సీట్లను దక్కించుకోనుంది. మిగిలిన ఒక్క స్థానం కోసం కాంగ్రెస్‌ పోటీపడుతోంది.

దీనికితోడు ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌,అసోంలలో బంపర్‌ మెజారిటీ సాధించిన దరిమిలా.. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే ఏడాది పెద్ద ఎత్తున బీజేపీ సభ్యులు రాజ్యసభలోకి రానున్నారు. కాబట్టి కాంగ్రెస్‌ ఇప్పుడప్పుడే ‘అతిపెద్ద పార్టీ’ హోదాను దక్కించుకునే అవకాశాలు లేవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement