కొత్త బ్యాంకుల లెసైన్సుల దిశగా మరో అడుగు... | Sakshi
Sakshi News home page

కొత్త బ్యాంకుల లెసైన్సుల దిశగా మరో అడుగు...

Published Sat, Oct 5 2013 2:28 AM

కొత్త బ్యాంకుల లెసైన్సుల దిశగా మరో అడుగు...

రాయ్‌పూర్: కొత్త బ్యాంకు లెసైన్సులను జారీ చేసే ప్రక్రియ వేగం పుంజుకుంది. లెసైన్సుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు రిజర్వ్ బ్యాంక్ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ఆర్‌బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ సారథ్యం వహిస్తుండగా ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఉషా థోరట్, సెబీ మాజీ చైర్మన్ సీబీ భవే, ఆర్థికవేత్త నచికేత్ మోర్ సభ్యులుగా ఉంటారు. శుక్రవారం జరిగిన  బోర్డు సమావేశం అనంతరం ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ విషయాలు తెలిపారు. కొత్త బ్యాంకుల అంశాన్ని పర్యవేక్షిస్తున్న డిప్యూటీ గవర్నర్ ఆనంద్ సిన్హా జనవరిలో రిటైరయ్యే లోగా లెసైన్సులను జారీ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు.
 
 కొత్త బ్యాంకింగ్  లెసైన్సుల కోసం మొత్తం 26 దరఖాస్తులు వచ్చాయి. టాటా సన్స్, అనిల్ అంబానీ గ్రూప్, కుమార మంగళం బిర్లా గ్రూప్ మొదలైన దిగ్గజ సంస్థలు బరిలో ఉన్నాయి. గడచిన 20 సంవత్సరాల్లో రెండు విడతలుగా ఆర్‌బీఐ ప్రైవేట్ రంగంలో 12 బ్యాంకులకు లెసైన్సులు ఇచ్చింది. 1993 జనవరిలో మార్గదర్శకాల ప్రకారం అప్పట్లో పది బ్యాంకులకు లెసైన్సులు ఇచ్చింది. ఈ అనుభవాలతో 2001 జనవరిలో మార్గదర్శకాలను సవరించి.. 2003-04లో కోటక్ మహీంద్రా బ్యాంక్, యస్ బ్యాంకులకు ఆర్‌బీఐ లెసైన్సులు జారీ చేసింది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement