పూంఛ్ సెక్టార్లో మళ్లీ పాకిస్థాన్ దళాల కాల్పులు | 3 jawans, civilian injured in Pakistan firing along LoC | Sakshi
Sakshi News home page

పూంఛ్ సెక్టార్లో మళ్లీ పాకిస్థాన్ దళాల కాల్పులు

Aug 15 2013 4:41 PM | Updated on Sep 1 2017 9:51 PM

పాకిస్థాన్ తన బుద్ధి మార్చుకోవట్లేదు. మరోసారి నియంత్రణ రేఖ వద్ద ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపి, రాకెట్లు, మోర్టార్లతో దాడులకు తెగబడింది.

సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా హెచ్చరించినా, ఏకంగా రాష్ట్రపతే సహనానికి హద్దు ఉంటుందని చెప్పినా పాపిస్థాన్గా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ తన బుద్ధి మార్చుకోవట్లేదు. మరోసారి నియంత్రణ రేఖ వద్ద ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపి, రాకెట్లు, మోర్టార్లతో దాడులకు తెగబడింది. దీంతో ముగ్గురు ఆర్మీ జవాన్లు, మరో పౌరుడు గాయపడ్డారు. జమ్ము కాశ్మీర్లోని పూంఛ్ సెక్టార్లోనే ఇదంతా జరిగింది. గడిచిన ఐదు రోజుల్లో పాకిస్థానీ దళాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది 11వ సారి.

పూంఛ్ జిల్లాలోని బాలాకోట్ ప్రాంతంలో ఉదయం 6.30 నుంచి పలు మార్లు భారత భూభాగం వైపు చొచ్చుకొచ్చి కాల్పులు జరిపినట్లు సైనికాధికారులు తెలిపారు. ఆటోమేటిక్ ఆయుధాలు, రాకెట్లు, మోర్టార్ షెల్స్తో దాడి చేయడంతో ముగ్గురు జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయి. పర్వైజ్ అనే స్థానికుడు కూడా గాయపడ్డాడు. బసోనియా గ్రామంలో ఓ గోశాల మీద రాకెట్ పడి పేలడంతో దాదాపు 12 ఆవులు చనిపోయాయి.

పాకిస్థానీ దళాలు తెల్లవారుజాము నుంచి ఎలాంటి కారణం లేకుండా కాల్పులు జరుపుతూ భారత్లోని మెంధార్ సెక్టార్ వైపు చొచ్చుకొచ్చినట్లు జమ్ము రక్షణ శాఖ ప్రతినిధి ఎస్ఎన్ ఆచార్య తెలిపారు. వెంటనే భారత దళాలు భారీ ఆయుధాలతో దీటుగా సమాధానమిచ్చాయని, మధ్యాహ్నం వరకు కాల్పులు కొనసాగాయని ఆయన తెలిపారు.

2003 సంవత్సరంలో భారత్-పాక్ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి అర్థం పర్థం లేకుండా పోతోంది. దాదాపు ప్రతిరోజూ ఇరు పక్షాల మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుంచి ఆగస్టు ఐదో తేదీ వరకు 57 సార్లు పాకిస్థానీ దళాలు కాల్పులు జరిపాయి. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే ఇది 80 శాతం ఎక్కువని రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement